గతవారం రోజులుగా ఆళ్లగడ్డ పంచాయితీ వార్తల్లో ఉన్న సంగతి తెలిసిందే. సైకిల్ యాత్ర చేస్తున్న తనపై మంత్రి భూమా అఖిలప్రియ దాడి చేయించారంటూ ఏవీ సుబ్బారెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. అనంతరం ఈ గొడవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరకి చేరింది. నిజానికి రెండ్రోజుల కిందటే చంద్రబాబును సుబ్బారెడ్డి కలిశారు. ఆరోజున మంత్రి అఖిల ప్రియ రాలేదు. ఈ ఇద్దరు నేతలతో ఈరోజు ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. సీఎం సమక్షంలో వాడీవేడీ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడారు.
విభేదాలు మరచి కలిసి పనిచేయాల్సిందా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారనీ, తాను మొదట్నుంచీ చెప్తున్నానీ, పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని సుబ్బారెడ్డి అన్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయనీ, వ్యక్తిగత విభేదాలు పక్కనపెట్టి, పార్టీ కోసం అందరూ పాటు పడాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ఆ తరువాత అఖిల ప్రియ మాట్లాడుతూ… భూమా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారనీ, తన తండ్రి ఆశయాలను కూడా ఆయన నెరవేర్చుతున్నారని అన్నారు. తనకు సలహాలూ సూచనలు ఇవ్వడానికి పెద్దదిక్కుగా ఆయనే ఉన్నారన్నారు. అందుకే, మీరు ఏం చెప్తే, అది మేము వింటామని చెప్పానన్నారు. చిన్నచిన్న సమస్యలు ఏవైనా ఉంటే, పార్టీకి చెడ్డపేరు రాకుండా పరిష్కరించుకుంటామన్నారు. ఆళ్లగడ్డలో మా కార్యకర్తలు, వాళ్ల కార్యకర్తలు ఎలాంటి ఘర్షణలకు దిగకుండా చూసుకుంటూ… అభివృద్ధి మీదే దృష్టి పెడతామన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలనీ, దీన్ని రచ్చ చెయ్యొద్దంటూ మీడియాకి కూడా అఖిల ప్రియ విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి మొదట్నుంచీ ఏవీ సుబ్బారెడ్డి అండగా ఉన్నారనీ, ఆయనతో కలిసిమెలిసి ముందుకు సాగుతామన్నారు.
మొత్తానికి, ఈ పంచాయితీకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం సీఎం చేశారని అనుకోవచ్చు. కానీ, ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలన్న కోరిక సుబ్బారెడ్డికి ఉందని అనిపిస్తోంది. ‘పార్టీ ఆదేశిస్తే’… అని చెబుతూనే పలుమార్లు ఈ విషయాన్ని బయటపెట్టారు. అసలు సమస్య కూడా అదే..! మరి, దీనిపై సుబ్బారెడ్డికి కొంత స్పష్టత ఇస్తే… ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయిందనే చెప్పొచ్చు. కానీ, చర్చల్లో ఏయే అంశాలు ప్రస్థావనకు వచ్చాయనేది బయటకి రాలేదు. ముఖ్యమంత్రి చెప్పారు… విభేదాలు వదిలి కలిసి పనిచేస్తామని మాత్రమే ఇద్దరూ అంటున్నారు.