కొండా సురేఖ మరోసారి వార్తల్లోకి వచ్చారు. మళ్లీ అదే టాపిక్… కొండా దంపతులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్ని మరోసారి ఖండించారు సురేఖ. తాము కేసీఆర్ తోనే ఉంటామనీ, తెరాసలోనే ఉంటామని స్పష్టం చేశారు. కొండా దంపతుల పార్టీ మార్పుపై అడపాదడపా ఊహాగానాలు వస్తుండటం.. వాటిని ఖండిస్తూ పార్టీ పట్ల తమకున్న చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవడం అనేది ఒక రొటీన్ వ్యవహారంగా మారిపోయింది! అయితే, గతం కంటే భిన్నంగా ఈసారి కొండా సురేఖ స్పందన ఉండటం గమనార్హం.
పార్టీ మార్పు ప్రసక్తే లేదనీ, ఈసారి ఎన్నికల్లో తనతోపాటు తన కుమార్తెకు కూడా టిక్కెట్ రావడం ఖాయమని సురేఖ చెప్పడం విశేషం. తమ కుమార్తె సుష్మను రాజకీయ వారసురాలిగా తీసుకొచ్చేందుకు కొండా దంపతులు కొన్నాళ్లుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకే, వచ్చే ఎన్నికల్లో తమతోపాటు కుమార్తెకు కూడా టిక్కెట్ దక్కించుకోవాలన్న ప్రయత్నంలో సురేఖ ఉన్నారు. తెరాసకు కూడా తమ డిమాండ్ వినిపించాలన్న ఉద్దేశంతోనే తాజాగా కుమార్తెకు కూడా టిక్కెట్ వస్తుందన్న ధీమా వ్యక్తం చేసినట్టు అర్థం చేసుకోవచ్చు.
నిజానికి, ఇప్పటికే కొండా ఫ్యామిలీ నుంచి మురళీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక, సురేఖ, సుష్మలకు స్థానం దక్కాలంటే పరకాల, వరంగల్ తూర్పు నుంచే అవకాశం ఉందనేది వారి అంచనా. కానీ, గతంలో సురేఖ ప్రాతినిధ్యం వహించిన పరకాలలో తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఉన్నారు. ఆయనకి మరోసారి సీటు ఖాయంగానే కనిపిస్తోంది. వరంగల్ తూర్పు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగాలని సురేఖ అనుకుంటున్నా.. అక్కడా తీవ్ర పోటీ ఉంది. ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు అక్కడ పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనతోపాటు తన కుమార్తెకు టిక్కెట్లు అడిగితే, సర్దుబాటు చేసే పరిస్థితి తెరాసలో లేదనే వాదన వినిపిస్తోంది. పైగా, టిక్కెట్లు కేటాయింపులూ లాంటి విషయంలో ఇతర నేతలు శాసించే పరిస్థితి తెరాసలో లేదు. సీఎం కేసీఆర్ ఏది చెబితే అది.. అంతే! సిట్టింగులకే టిక్కెట్లు అని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి మరో రెండు టిక్కెట్లు కావాలని సురేఖ షరతులు పెడుతున్నారు. ఒకవేళ కొండా ఫ్యామిలీ ఆశించినట్టు టిక్కెట్లు దక్కకపోతే… వేరే దారి చూసుకుంటామనే సంకేతాలు కూడా సురేఖ ఇస్తున్నారు! మరి, సురేఖ షరతులూ సంకేతాలను తెరాస ఎలా చూస్తోందనేదే ఇప్పుడు ముఖ్యం.