గబ్బర్ సింగ్ సినిమా షూటింగుని మధ్యలో నిలిపివేసి పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళుతున్నారని మీడియాలో ఊహాగానాలు వినిపించేయి. సరిగ్గా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దావోస్ పర్యటన ముగించుకొని సింగపూర్ వస్తుండటంతో, ఆయన పిలిచినందునే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళుతున్నారని ఊహాగానాలు వినిపించేయి. కానీ గబ్బర్ సింగ్ షూటింగులో పాల్గొంటున్నప్పుడు ఆయన కాలికి చిన్న దెబ్బ తగలడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ షూటింగ్ ను వాయిదా వేసుకొని ఇంటికి చేరుకొన్నారని తాజా సమాచారం. షూటింగులో పాల్గొంటునప్పుడు ఆయన కాలు బెణికడంతో నొప్పితో చాలా బాధపడుతున్నారు. కనుక ఆయన సింగపూర్ బయలుదేరడం..అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవడం అంతా ఊహాగానాలేనని స్పష్టమవుతోంది. అయితే ఆయన సింగపూర్ బయలుదేరుతున్నట్లు ఎవరు ఎందుకు పుకారు పుట్టించారో తెలియదు కానీ అది దావానంలా కొన్ని గంటల వ్యవధిలోనే మీడియా అంతటా వ్యాపించింది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నటీనటుల మేనేజర్లయినా తక్షణం ఆ విషయం గురించి మీడియాకి తెలియజేస్తూ ఉంటే ఇటువంటి పుకార్లకి, ఊహాగానాలకి అవకాశం ఉండదు కదా.