ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచీ ఆయనకి సీఎం చంద్రబాబు బాగానే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. తాజాగా నామినేటెడ్ పదవుల విషయంలో కూడా పెద్దపీట వేశారు. ముందుగా, ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కిషోర్ ని నియమించారు. వెంటనే దాన్ని మారుస్తూ… ఆయనకి హౌసింగ్ కార్పొరేషన్ ఇవ్వడం విశేషం. ఇరిగేషన్ కంటే హౌసింగ్ కార్పొరేషన్ కీలకమైంది కాబట్టే… తన నిర్ణయాన్ని సీఎం మార్చుకున్నారనీ, తద్వారా నల్లారి కిషోర్ కు టీడీపీలో దక్కుతున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే, కిషోర్ కి పార్టీలో ప్రాధాన్యత కల్పించడం ద్వారా పార్టీపరంగా చంద్రబాబు ఆశిస్తున్నది వేరని తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. పీలేరులో అయితే దాదాపు రెండు దశాబ్దాలుగా పార్టీ మరింత నీరసంగా ఉంది. ఇప్పుడు ఇదే ప్రాంతానికి చెందిన కీలకనేత కిషోర్ టీడీపీలోకి వచ్చేసరికి.. అక్కడ బలం పెరిగినట్టయింది. దీంతోపాటు రాజంపేట పార్లమెంటు నియోజక వర్గంపై పట్టు సాధించాలన్నది టీడీపీ అధినేత లక్ష్యంగా కొంతమంది చెబుతున్నారు. ఇక్కడ కొన్నేళ్లుగా కొనసాగుతున్న పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయాధిపత్యాన్ని దెబ్బతీయడమే వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో పీలేరు, పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన పెద్దిరెడ్డి మరో రెండు నియోజక వర్గాల్లో గట్టి బలమే ఉంది. ఈ ప్రాంతాల్లో నల్లారి ఫ్యామిలీకి కూడా మంచి పట్టే ఉంది.
కిషోర్ టీడీపీలో చేరేసరికి.. ఈ ప్రాంతాల్లో టీడీపీకి అనూహ్యంగా కొత్త బలం వచ్చినట్టయింది. ఎలాగూ అధికారంలో ఉన్నారు కాబట్టి, నల్లారి కిషోర్ కాస్త బలంగా కృషి చేస్తే… ఎంపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పచ్చ జెండా ఎగరెయ్యొచ్చనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే, పార్టీలో కిషోర్ ప్రాధాన్యత ఇస్తూ, ఆయన మరింత క్రియాశీలంగా వ్యవహరించేందుకు అనువైన పదవిని కూడా చంద్రబాబు కట్టబెట్టారని అనుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ… పార్టీ బలోపేతానికి తనవంతు బాధ్యతను కిషోర్ నిర్వర్తించాల్సి ఉంది. పార్టీలో చేరిన వెంటనే నల్లారి కిషోర్ కి అంత ప్రాధాన్యతా అన్నట్టు కనిపిస్తున్నా, తెరవెనక ఆయనపై అంతే బాధ్యత కూడా ఉందని చెప్పుకోవచ్చు.