తెలుగు చిత్రపరిశ్రమ `గురువుగారూ` అని ఆత్మీయంగా పిలుచుకున్న ఒకే ఒక్క వ్యక్తి… దాసరి నారాయణరావు. దర్శకులకు గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. దర్శకులకు స్టార్ డమ్ ఆయన వల్లే వచ్చింది. ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనకే దక్కింది. దాసరి స్కూల్ నుంచి వచ్చిన దర్శకులు, కథానాయకులు, నాయికలు, రచయితలు, టెక్నీషియన్లు ఎంతో మంది. తెలుగు చిత్రసీమలో ఆయనది ఓ సువర్ణ అధ్యాయం. ఆయన స్మృతికి చిహ్నంగా హైదరాబాద్లోని ఫిల్మ్ఛాంబర్లో ఓ విగ్రహం ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాసరి ప్రియ శిష్యుల్లో ఒకరైన సి.కల్యాణ్ ముందుకొచ్చి దాసరి విగ్రహాన్ని తయారు చేయించారు. మే 4న ఈ విగ్రహాన్ని ఛాంబర్లో ప్రతిష్టించబోతున్నారు. ఈ కార్యక్రమానికి చలన చిత్రసీమలోని హీరోలు, దర్శకులు, నిర్మాతలూ పాల్గొంటారు. పనిలో పనిగా దాసరి పేరుతో ఓ అవార్డు ప్రకటిస్తే బాగుంటుంది.