తెలంగాణ రాజకీయ ఐక్య కార్యచరణ సమితి అధ్యక్షునిగా… ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన ఆచార్య కోదండరాం.. నేటి నుంచి ఫక్తు రాజకీయనాయకుడిగా మారుతున్నారు. టీజేఏసీ పదవికి రాజీనామాచేసిన ఆయన ఈ రోజు నుంచి తన తెలంగాణ జన సమితి అధ్యక్షునిగా బాధ్యతలు చేపడుతున్నారు. భారీ బహిరంగభ నిర్వహించి టీఆర్ఎస్కు హెచ్చరికలు పంపాలనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టీ జేఏసీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసి ఉద్యమించాయి. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కోదండరాంను దూరం పెట్టారు. కొన్ని పదువులు ఇస్తామని కేసీఆర్ కబురు పెట్టినా.. కోదండరాం వద్దన్నారని ప్రచారం జరిగింది.
ఆ తర్వాత కోదండరాం.. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుదంటూ ఉద్యమం ప్రారంభించారు. చివరిగా అది రాజకీయ పార్టీగా మార్పు చెందింది. కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ జనసమితి పార్టీ ని టీఆర్ఎస్ లెక్కలోకి తీసుకోనట్లు కనిపిస్తున్నా..అంతర్గతంగా మాత్రం.. ఆ పార్టీలో ఆందోళన కనిపిస్తోంది. కోదండరాంకు జనాల్లో పలుకుబడి బాగా ఉందన్న అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నిరుద్యోగులు, రైతులు, కార్మికులు కోదండరాం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి తోడుగా అధికార పార్టీలో గుర్తింపు దక్కని నేతలంతా తమ పార్టీ వైపు వచ్చే అవకాశాలున్నాయని కోదండరాం నమ్మకంగాఉన్నారు. కోదండరాంను రాజకీయంగా ఎదుర్కోవడం సులువని అధికార పార్టీ నేతలు బయటికి చెపుతున్నా…. కోదండరాంకు జనాల్లో ఉన్న ఫాలోయింగ్‌తో ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలను సంఘటితం చేయాలని కోదండరాం భావిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతల్లో తమ ఓట్లకు గండి పడుతుందన్న భయందోళనలు మొదలయ్యాయి.
తెలంగాణ జన సమితి పేరుతో పార్టీ గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. పార్టీ ఎన్నికల గుర్తుగా బాణం కేటాయించాలని కోరారు. కోదండరామ్ టీం పకడ్బందీ ప్రణాళికలతోనే ఉంది. జాతీయ ఎన్నికల నిపుణుడు యోగేంద్ర యాదవ్‌తో పలు మార్లు రహస్య చర్చలు జరిపారు. టీఆర్ఎస్ను స్థాపించినప్పుడు కేసిఆర్‌కు సన్నిహితంగా ఉన్న గాదె ఇన్నయ్యవంటివారు ఇప్పుడు కోదండరామ్ పార్టీ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ చూస్తే.. తెలంగాణ జనసమితిని టీఆర్ఎస్ అంత తేలిగ్గా తీసి పారేయలేరన్న భావన వ్యక్తమవుతోంది.