ఈ మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువగా దేనికి సమయం కేటాయిస్తున్నారో చూస్తున్నాం! మీడియాపై వార్ అంటూ గడచిన రెండువారాలుగా చాలా హడావుడి చేశారు. ట్విటర్ వేదికగా చేసుకుని రాస్తూనే ఉన్నారు! సరే, ఆ అంశాన్ని ప్రాధాన్యత దాదాపు తగ్గిందనే చెప్పాలి. దీంతో ఇప్పుడు పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ నిర్మాణంపై మరోసారి దృష్టి పెట్టారట. జిల్లాలవారీగా సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా దాదాపు 17 లక్షల మంది జనసైనికులు చేరారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. వీరందరికీ ఐడెంటిటీ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.
దీంతోపాటు ఇకపై క్షేత్రస్థాయికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన మొదలుపెట్టింది. సెంటిమెంట్ గా తూర్పు గోదావరి జిల్లా నుంచి నమోదు ప్రక్రియను ప్రారంభించారు. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలు ఫలితాలను ఏ స్థాయిలో ప్రభావితం చేశాయో తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోక వర్గాలున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఈ జిల్లాని ప్రత్యేకంగానే చూస్తాయి. గోదావరి జిల్లాలు తీర్పు ఎటువైపు ఉంటే, అధికారం అటువైపే అనే అభిప్రాయం ఉంది. అందుకే, అక్కడి నుంచే సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఇకపై, గ్రామస్థాయి నుంచి పార్లమెంటు వరకూ ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి ఎన్నికలు వచ్చినా జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని జిల్లా నాయకులు అంటున్నారు. టీడీపీ, భాజపా, వైకాపాలకు దూరంగా పవన్ ఉంటున్నారన్న అభిప్రాయంతో యువత ఎక్కువగా ఆకర్షితం అవుతున్నారనీ, పెద్ద సంఖ్యలో సభ్యులుగా చేరేందుకు మొగ్గు చూపుతున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి.
మంచిదే, కానీ.. ఇప్పుడు సమస్య పవన్ వెనక ఎవరున్నారు, పవన్ ఎవరికి మద్దతుగా ఉన్నారనేది కాదు! తాజా వివాదం నేపథ్యంలో పవన్ కల్యాణ్ కొంత గందరగోళానికి గురౌతున్నారనే అభిప్రాయం ఏర్పడింది. సరైన హోం వర్క్ లేకుండా ఆయన వివాదాలకు దిగడం, కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలూ విమర్శలూ చేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో జనసేన వర్గాల్లో కూడా కొంత చర్చ జరిగినట్టు సమాచారం. పార్టీపరంగా పవన్ విధివిధానాలు ఏంటనే సందిగ్ధం ఆ పార్టీ వర్గాల్లో నెలకొందనే అభిప్రాయమూ ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు మాత్రమే కాదు, దాంతోపాటు పార్టీ శ్రేణులకు విధివిధానాలపై స్పష్టత ఇవ్వాలి.