శ్రుతి హాసన్ లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. బ్రిటీష్ నటుడు మైఖైల్తో శ్రుతి చట్టా పట్టాలేసుకుని తిరగడం, ఆ ఫొటోలు వైరల్ అవ్వడం తెలిసిన అంశాలే. కమల్ కుటుంబ వేడుకల్లోనూ మైఖెల్ కనిపించడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. తన ప్రేమ, పెళ్లి గురించి శ్రుతి ఇప్పుడు స్పందించింది. ”మైఖెల్ నాకు మంచి స్నేహితుడు. అంతకంటే ఇప్పుడేం చెప్పలేను. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఎప్పుడు చేసుకుంటానో కూడా తెలీదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా, ఇంట్లోవాళ్లు దానికి విలువ ఇస్తారు. నా పెళ్లి గురించి నేనే నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్పేంత వరకూ కాస్త ఆగండి. నా అనుమతి లేకుండా నాపెళ్లైతే జరగదు కదా” అంటూ పాము చవకుండా, కర్రవిరక్కుండా సమాధానం ఇచ్చింది శ్రుతి.
ఈమధ్య తెలుగులో శ్రుతి కనిపించడం లేదు. అయితే ఇదంతా కావాలని తీసుకున్న విరామమేనట. కొత్త పనులు చేయాలనుకున్నప్పుడు కొత్త ఉత్సాహంతో రావాలి. అందుకే విరామం తీసుకున్నానంటోంది. ”వరుసగా తొమ్మిదేళ్లు పనిచేశా. ఓ యేడాది విరామం తీసుకోవడంలో తప్పేం లేదు” అని సమర్థించుకుంటోంది. మరి శ్రుతి చేయబోయే ఆ కొత్త పనులేమిటో..?