ఇది ఏడాది కిందటి మాట..!. తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నప్పుడు ఎన్డీఏ మీటింగ్ జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో చాలా రోజుల తర్వాత ఎన్డీఏ పక్షాల భేటీ జరిగింది. ఆ భేటీలో మోదీ, షా ప్రసంగం మొత్తం.. జమిలీ ఎన్నికలపైనే జరిగింది. మెజార్టీ పక్షాలను కలుపుకుని… 2019లో పాక్షిక జమిలీ ఎన్నికలు, 2024లో పూర్తి స్థాయిలో దేశం మొత్తం ఒకేసారి.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఎన్నికలు జరపాలనేది.. మోదీ, షా లక్ష్యంగా చెప్పుకున్నారు. అప్పుడు కూటమిలో ఉన్న తెలుగుదేశం.. జమిలీ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమని ప్రకటించింది. ఏడాది తిరిగేలోపే పరిస్థితి తిరగబడింది. ఇప్పుడు భారతీయ జనతాపార్టీనే జమిలీ ఎన్నికలకు వెళ్లేందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. కమిటీల పేరుతో చేసిన హడావుడిని ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది.
ఈ ఏడాది చివర్లో.. మధ్యప్రదేశ్,చత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరంలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ మేలో..లోక్ సభ ఎన్నికలతో పాటే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో కేంద్రం..డిసెంబర్లో ఈ అన్ని రాష్ట్రాలతో పాటు… పదవి కాలం ఏడాదిలో ముగియనున్న తమ పాలిత రాష్ట్రాలను కూడా కలిపి సగం రాష్ట్రాల్లో అయినా జమిలీ ఎన్నికలు నిర్వహించాలనేదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆలోచన. ఈ మేరకు ఎన్నికల సంఘానికి దిశానిర్దేశం చేశారు. న్యాయశాఖ కొన్ని కమిటీల్ని నియమించింది. జమిలీ ఎన్నికలు జరిగితే వచ్చేసమస్యలను అధ్యయనం చేసి ఆ కమిటీ పరిష్కారాలను సూచించింది కూడా.
కానీ ఏడాదిలోనే రాజకీయ పరిస్థితులు తిరగబడిపోయాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తానికే మోసం వచ్చే ప్రమాదం ఉందని ప్రమాద ఘంటికలు మోగుతూండటంతో.. ఎందుకొచ్చిన రిస్క్ అని మోదీ , షా సైలెంట్ అయిపోయారు. గతంలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా.. ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందస్తు ఎన్నికలకు వెళ్లి దెబ్బతిన్న విషయాన్ని బీజేపీ అగ్రనేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఏడాది కిందట ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని.. అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా.. ప్రజల మద్దతు లభించిందని.. ఇప్పుడు మంచి నిర్ణయాలు తీసుకున్నా.. ప్రజలు తప్పుపట్టే స్థాయిలో వ్యతిరేకత ఉందని.. బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అందుకే పరిస్థితులు మెరుగుపడేందుకు ప్రయత్నించి జరగాల్సిన సమయంలోనే ఎన్నికలు జరిపితే … ఉరుకున్నంత ఉత్తమం.. బోడిగుండంత సుఖం అని డిసైడయ్యారు.