తెలుగు సినీ నటులపై అమెరికాలో ప్రవాసాంధ్రులు చూపించే ఆదరణ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు విదేశాల్లో సినిమా రిలీజ్ చేసుకోవాలంటే.. ప్రింట్ల ఖర్చులు కూడా వస్తాయో రావో అన్న అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు సినిమా సక్సెస్ అయితే… బడ్జెట్ మొత్తం కలెక్షన్లు అమెరికా నుంచే వస్తున్నాయి. తెలుగు సంఘాల సమావేశాలు జరగాలన్నా… చిన్నచితకా స్టార్ల దగ్గర్నుంచి పెద్ద హీరోల వరకూ అందరూ స్పెషల్ ఎట్రాక్షనే. టాలీవుడ్‌కు సంబంధించి ఏదైనా కార్యక్రమం కోసం నిధులు సేకరించేందుకు ఏర్పాటు చేసే ఈవెంట్లలో అంచనాలకు మించి నిధులు వచ్చిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదంతా గతంగా మారిపోయింది. “మా” ఆధ్వర్యంలో చిరంజీవి ముఖ్యఅతిధిగా నిర్వహించిన సిల్వర్ జూబ్లీ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. యాభై శాతానికిపైగా టిక్కెట్లు మిగిలిపోయాయి. ఇది కాక ఈవెంట్ జరిగే ఆడిటోరియం ముందు.. ప్రవాసాంధ్రుల నిరసనలు మచ్చలా అలా ఉండిపోనుంది.
టాలీవుడ్‌కు ఈ దుస్థితికి రావడానికి కారణం స్టార్లుగా చెప్పుకునే నటులే. ప్రజల ఆదరాభిమానాలతో హీరోలుగా ఎదిగిన వారు… ఆ ప్రజలకు ఎంతో కొంత మేలు చేయడానికని ప్రకటించి రాజకీయాల్లోకి వెళ్తున్నారు. కానీ తాత్కాలిక ప్రయోజనాల కోసం.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. కనీసం స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉందని తెలిసినప్పుడు కూడా.. ఈ తారలెవరూ నోరు మెదపడం లేదు. ఇటీవలి కాలంలో ప్రవాసాంధ్రులు.. రాజకీయంగా యాక్టివేట్ అయ్యారు. ఏపీలో ఏ కార్యక్రమం అయినా రాజకీయ పరంగా తీసుకుంటున్నారు. ఫలితంగా ఏపీపై టాలీవుడ్ తారల శీతకన్ను వ్యవహారాన్ని కూడా వారు అంతే తీసుకున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు చిరంజీవి ఏపీ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం.. పవన్ కల్యాణ్ కూడా.. ప్రత్యేకహోదా కోసం ఒక్క మాట మాట్లడకుండా.. నేరుగా ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూండటంతో… ప్రవాసాంధ్రులకు సినీ తారల రాజకీయాలు వెగటు పుట్టించాయి.
ఈ పరిణామాలన్నీ సినీతారలపై… ప్రవాసుల్లో ఉండే క్రేజ్‌ను తగ్గించడమే కాదు.. మైనస్‌గా మార్చేశాయి. ఆ ప్రభావం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఈవెంట్‌పై నేరుగానే పడింది. మెగాస్టార్ చిరంజీవికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక ముందు తమ క్రేజ్‌ను ఆధారంగా చేసుకుని ఏవైనా ఈవెంట్లు ప్లాన్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి టాలీవుడ్‌కి వచ్చింది. ఒకప్పుడు నీరాజనాలు పలికిన ప్రవాసాంధ్రులు ఇప్పుడు నిరసనల బాట పట్టారు. అంటే పూలమ్మిన చోట కట్టెలమ్ముకోవడమే.