బయోపిక్‌ల జమానా ఇది. బాలీవుడ్లోనే కాదు, టాలీవుడ్‌లోనూ జీవిత కథలు వరుసకడుతున్నాయి. ఈ జాబితాలో మరో కథ చేరబోతున్నట్టు తెలుస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్‌కి ప్రస్తుతం బాలీవుడ్లో రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. శ్రీదేవి భర్త స్వయంగా బోనీ కపూరే ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బాధ్యతని ఓ ప్రముఖ దర్శకుడికి అప్పగించారని, స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయని వచ్చే యేడాది ప్రారంభంలోగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. శ్రీ, శ్రీదేవి, శ్రీమామ్ అనే మూడు టైటిళ్లని బోనీకపూర్ ఈ సినిమా కోసం రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. బాలనటిగా ఎదిగి, కథానాయికగా మారి, స్టార్ హీరోయిన్గా దశాబ్దాల పాటు చిత్రసీమని ఏలిన శ్రీదేవి కెరీర్లో పలు ఆసక్తికరమైన మలుపులున్నాయి. పైగా శ్రీదేవి అంటే ఆల్ ఇండియా స్టార్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె చిత్రానికి విపరీతమైన గిరాకీ ఏర్పడుతుంది. అందుకే శ్రీదేవి సినిమాపై బోనీ కపూర్ అంత పట్టుగా ఉన్నారని సమాచారం. శ్రీదేవి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది కీలకమైన ప్రశ్న. ఓ దర్శకుడ్ని ఎంచుకుని, టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారంటే… హీరోయిన్ కూడా దాదాపుగా ఖాయమై ఉంటుంది. ఆమె ఎవరన్నది బోనీకే తెలియాలి.