ఎట్టకేలకు తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభ నిర్వహించుకుంటామని అనుమతుల కోసం కోదండరామ్ ఎన్ని ప్రయత్నాలు చేశారో తెలిసిందే. రకరకాల అభ్యంతరాల పేరుతో ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. చివరికి హైకోర్టును ఆశ్రయించడంతో సభ నిర్వహణకు మార్గం సుగమమైంది. దీంతో ఆదివారం నాడు హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో సభ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై ఘాటుగానే విరుచుకుపడ్డారు కోదండరామ్.
రాష్ట్రంలోని నిరంకుశ పాలన అంతమొందించడం కోసమే జనసమితి పోరాడుతుందన్నారు. అమరుల కుటుంబాలను చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఉద్యమంలో భాగంగా రైల్ రోకోలు చేశారు, వంటవార్పుల పేరుతో రోడ్ల మీదికి ఎంతోమంది వచ్చారన్నారు. ఉద్యమం కోసం 650 మంది ప్రాణత్యాగాలు చేశారనీ, వీరంతా ఎమ్మెల్యేలు కావాలనో, మంత్రి పదవులు దక్కించుకోవాలనో `ప్రాణ త్యాగాలు చేయలేదన్నారు. తెలంగాణ సంపద అంతా మూడు జిల్లాలకే పరిమితం అవుతోందన్నారు. ఆ జిల్లాలో కూడా కొంతమంది మాత్రమే బాగుపడుతున్నారన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ, కావాలంటే లెక్కలు తీసి చూపిస్తా అన్నారు. 15 వేల పోస్టులను భర్తీ చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారనీ, కానీ వాటిలో పదివేలు కేవలం పోలీసు ఉద్యోగాలు మాత్రమే అన్నారు. చిన్న కంపెనీలు పెట్టి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని తాము డిమాండ్ చేశామన్నారు. రాష్ట్రంలో మూతపడి ఉన్న పరిశ్రమలను తెరిపించలేకపోయారన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 4 వేలు రైతులు సమస్యల్ని తీర్చలేదన్నారు. పంటలకు మద్దతు ధర పెంచితే బాగుంటుందన్నారు.
రైతులు, యువతను లక్ష్యంగా చేసుకునే ప్రధానంగా కోదండరామ్ మాట్లాడారు. ప్రసంగంలో ఆయన లేవనెత్తిన అంశాలు ఆలోచింపజేసేవిగానే ఉన్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు మంచి పాలన లభించడం లేదన్న ఆలోచనను రేకెత్తించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఈ కోణం నుంచి ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు. అయితే, వీటిని పార్టీ విధివిధానాలుగా మార్చాల్సిన అవసరం ఉంది. ఏడాదిలో ఎన్నికలున్నాయి. ఈలోగా తన ఉనికిని తెలంగాణ జన సమితి ఎంతవరకూ బలోపేతం చేసుకుంటుందో చూడాలి.