తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… బయట ఎలాంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నా… తన ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను మాత్రం ఆచరణలోకి తీసుకురావడానికి సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. రైతుల బతుకుల్ని మార్చేస్తానని ఆయన ఓ ఎజెండాను రెడీ చేసుకుని.. మొదట కోల్ కతా వెళ్లారు. మమతా బెనర్జీతో మాట్లాడారు. ఆ తర్వాత బెంగళూరు వెళ్లారు. దేవేగౌడతో చర్చలు జరిపారు. నిన్న చెన్నై వెళ్లారు. కరుణానిధితో చర్చలు జరిపారు. అలాగే హైదరాబాద్ వచ్చిన జార్ఖండ్ మాజీ సీఎం..జేఎంఎం నేత హేమంత్‌సోరెన్‌కు కూడా ప్రగతి భవన్ ఆతిధ్యం ఇచ్చి .. తన ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన చెప్పారు. నెక్ట్స్ భువనేశ్వర్ వెళ్లి నవీన్ పట్నాయక్‌తోనూ.. ఆ తర్వాత ముంబై వెళ్లి శివసేన నేతలతోనూ మాట్లాడాలనుకున్నారు. అయితే హఠాత్తుగా ఈ జాబితాలో.. కేసీఆర్.. టీడీపీ అధినేత చంద్రబాబును చేర్చారు. అమరావతిని షెడ్యూల్‌లో కలిపేశారు.
చంద్రబాబు తనకు మంచి మిత్రుడని… అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసి .. జాతీయ రాజకీయాలపై చర్చించి.. ఫెడరల్ ఫ్రంట్ విషయంపై ఓ అవగాహనకు వస్తానని చెన్నైలో ప్రకటించారు. నిజానికి కేసీఆర్ .. ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన చేసి చాలా కాలమయింది.. ఇంత వరకూ గుర్తు రాని చంద్రబాబు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చారు..? బీజేపీతో చంద్రబాబు కటిఫ్ చెప్పి పోరాటం ప్రారంభించినప్పుడే కేసీఆర్ ఫెడరల్ ఆలోచనలు చేశారు. అప్పుడే చంద్రబాబును ఎందుకు కలవలేదు..? ఇప్పుడే ఎందుకు కొత్త తరహా రాజకీయం ప్రారంభించారు..?
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆశతోనే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశం పట్టుకు తిరుగుతున్నారని చాలా మంది భావిస్తున్నారు. కానీ కేసీఆర్‌తో అలా తిప్పిస్తోందని బీజేపీనేనని చాలా మంది నమ్ముతున్నారు. దానికి తగ్గట్లుగా కాంగ్రెస్ కు సన్నిహితంగా ఉన్న పార్టీలనో.. లేదా కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం ఉన్న పార్టీలనే టార్గెట్ చేసుకుని కేసీఆర్ కూటమి చర్చలు కొనసాగిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు తన ఫ్రంట్ ఆలోచనల్లోకి చంద్రబాబును రానీయలేదు. చంద్రబాబు … తనకు జాతీయ రాజకీయాలపై ప్రస్తుతం ఆలోచనే లేదని.. ఏపీకి న్యాయం జరిగేలా పోరాడటం తప్ప మరో ఆలోచన లేదని.. చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్‌కూ ఇదే సమాధానం చెబుతారు .
కొసమెరుపేమిటంటే.. .. గతంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం కేరళలో జరినప్పుడు తెలంగాణ మంత్రిని కేసీఆర్ పంపలేదు. మే ఏడో తేదీన ఏపీ ఆధ్వర్యంలో బీజేపీయేత రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరుగుతోంది.దీనికి రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది.దీనికి తెలంగాణ ఆర్థిక మంత్రిని కూడా ఆహ్వానించారు. ఆయన అమరాతి వస్తే.. కేసీఆర్ – చంద్రబాబుల రాజకీయ పయనంపై ఓ అవగాహన రాజకీయవర్గాలకు వచ్చే అవకాశం ఉంది.