ఎన్టీఆర్ బయోపిక్ నుంచి దర్శకుడిగా తేజ తప్పుకోవడంతో ఆ బాధ్యతలు బాలకృష్ణ తీసుకోవడం దాదాపుగా లాంఛనమే. అయితే ఈలోగా ఆయన చివరిసారి క్రిష్ కోసం గట్టిగా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇది వరకే క్రిష్‌ని సంప్రదించినా `మణికర్ణిక` చేతిలో ఉండడం మూలంగా బాలయ్య ప్రతిపాదనని అంగీకరించలేకపోయాడు. ఈసారి ఏమైనా వీలు కుదురుతుందేమో అని… బాలయ్య మరోసారి క్రిష్ ని ఈ విషయమై మరోసారి సంప్రదించినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ `ఓకే` చేయడానికి క్రిష్ కొన్ని కండీషన్లు విధించినట్టు సమాచారం. అందులో ప్రధానమైన షరతు.. స్క్రిప్టు మార్చిరాయడం. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. డైలాగులతో సహా రెడీ అయ్యాయి. కానీ క్రిష్ మాత్రం ”ఎన్టీఆర్ చిత్రాన్ని నా కోణంలో తీయాలనుకుంటున్నా. స్క్రిప్టు విషయంలో కలగజేసుకోకపోతే.. ఈ బాధ్యత తీసుకుంటా” అన్నాడట. అంతేకాదు. టెక్నికల్ టీమ్‌లో కూడా తనకు నచ్చినవాళ్లే ఉండాలని, అన్నింటికంటే ముఖ్యంగా మణికర్ణిక విడుదల అయ్యాకే… ‘ఎన్టీఆర్’ బయోపిక్ పనులు మొదలెడతానని చెప్పాడట. ఈకండీషన్లకు బాలయ్య ఒప్పుకోలేకపోతున్నాడని, స్క్రిప్టు మార్చడం దాదాపు అసాధ్యం అని చెప్పాడని, దాంతో క్రిష్ ఈ ప్రాజెక్టు వదులుకున్నాడని తెలుస్తోంది. ఈమధ్యలో కొంతమంది ‘ఈ సినిమా చేయకు’ అంటూ సలహాలూ ఇచ్చారని సమాచారం. అందులో ఓ అగ్ర దర్శకుడు కూడా ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఇవేం పట్టించుకోకుండా బాలయ్య రంగంలో దిగబోతున్నాడు.