తెలంగాణా తెదేపా విద్యార్ధి విభాగం నేత శ్రీకాంత రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ చేయబడ్డాడు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో అక్బర్ బాగ్ నుంచి పోటీ చేయాలనుకొన్న అతనికి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించి పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చిత్రం ఉన్న ఫ్లెక్సీ బ్యానర్ ని చింపి వేసి, గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపీనాద్, రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకొంటున్నారని తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణాలో పార్టీని బ్రతికించుకొనే ఉద్దేశ్యం ఉన్నట్లయితే జూ.ఎన్టీఆర్ కి పార్టీ బాధ్యతలు అప్పగించాలని శ్రీకాంత రెడ్డి డిమాండ్ చేయడం విశేషం. పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెదేపా విద్యార్ధి సంఘం అధ్యక్షుడు మదన్ మోహన్ రావు ప్రకటించారు.
జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వనందుకు ఇంకా చాలా మంది తెదేపా కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసనలు తెలిపారు. వారెవరిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. కానీ శ్రీకాంత రెడ్డి ఒక్కరిపైనే ఎందుకు తీసుకొన్నారు అంటే బహుశః ఆయన జూ.ఎన్టీఆర్ ప్రస్తావన చేసినందుకేనేమో? జూ.ఎన్టీఆర్ ని మళ్ళీ పార్టీలోకి ప్రవేశించకుండా అధిష్టానం జాగ్రత్తపడుతునప్పుడు, అతనికి తెలంగాణా బాధ్యతలు అప్పగించాలని శ్రీకాంత రెడ్డి డిమాండ్ చేస్తే దానిని జీర్ణించుకోవడం కష్టమే కదా? బహుశః అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేసారనుకోవాలేమో?