పార్టీలో మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పాత్రపై చర్చ జరుగుతోందంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సభ్యులుగా ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ లో ఇదే అంశం తాజాగా చర్చకు వచ్చిందట. సుజనా చౌదరి పాత్రపై కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తే.. దానిపై వాట్సాప్ గ్రూప్ లో మంత్రి నారా లోకేష్ స్పందించారట. తమకు అలాంటి సమాచారమేమీ లేదనీ, వాస్తవాలు ఏవైనా ఉంటే అవే బయటకి వస్తాయని మంత్రి లోకేష్ ఆ వాట్సాప్ గ్రూప్ లో అభిప్రాయపడ్డారని సమాచారం. దీంతో టీడీపీ వర్గాల్లో కొంత చర్చ జరుగుతోందట. ఇవన్నీ పుకార్లే అని లోకేష్ ఖండించే ప్రయత్నంగానీ, ఈ చర్చకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మంత్రి నారా లోకేష్ స్పందన ఉండటం లేదనే విశ్లేషణలు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయట.
దీనికి సపోర్టివ్ గా ఎప్పటివో కొన్ని అంశాలను కూడా ఆ కథనంలో ప్రస్థావించారు. నిజానికి, గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో సుజనా అత్యంత కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా పార్టీకి నిధుల సమీకరణ, ఇతర పార్టీల నుంచి కొంతమంది నేతలను చేర్చుకోవడం వంటి అంశాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు. ఆ తరువాత, కేంద్రం- ఆంధ్రా మధ్య వారధిగా ఉన్నారు. అయితే, కేంద్రంతో రాష్ట్ర సమస్యల కంటే తన వ్యక్తిగత విషయాల్లోనే ఎక్కువగా సంప్రదింపులు ఉంటున్నాయనే భావన అప్పట్లో చంద్రబాబుకి ఏర్పడిందనీ, అందుకే ఇంకోపక్క గల్లా జయదేవ్, రామ్మోహన నాయుడు వంటి వారిని ప్రోత్సహించడం మొదలుపెట్టారని కూడా ఈ కథనంలో ప్రస్థావించారు.
నిజానికి, సుజనా చౌదరి భాజపా వైపు వెళ్తారా అనే ఊహగానాలు వినిపించిన సంగతి అయితే వాస్తవమే. అదేదో ఇప్పటి మాట కాదు. అదీ ఎప్పుడంటే… కేంద్రం తీరుకి నిరసనగా ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నప్పుడు..! ఆ తరువాత, దాని గురించి ఎక్కడా ఆ చర్చ అంటూ కథనాల్లేవు. దానికంత ప్రాధాన్యత కూడా లేదు. కానీ, ఇప్పుడు మరోసారి అదే అంశమై వాట్సాప్ గ్రూప్ లోకేష్ సశేషం అంటూ స్పందించడం చర్చనీయమైందని కథనం రావడం విశేషం. ప్రాక్టికల్ గా చూసుకుంటే… ఏపీలో భాజపాకి ఉన్న ప్రస్తుత ఇమేజ్ దృష్ట్యా ఆ పార్టీలోకి చేరడం అనేది ఏ స్థాయి నాయకుడికైనా ఆత్మహత్యాసాదృశమే. ఉన్న నేతలే బయటకి వెళ్లిపోవాలని చూస్తున్నారు. అలాంటిది సుజనా లాంటివాళ్లు వెళ్లడం.. ఊహించలేం కదా.