రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రకాలుగా ప్రయత్నించాననీ, చివరి ప్రయత్నంగా కేంద్రంపై పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో జరిగిన సభలో ఆయన ప్రసగించారు. నాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇదే తిరుపతికి నరేంద్ర మోడీ వచ్చారనీ, ఏపీని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అంతేకాదు, నాడు తిరుపతిలో మోడీ మాట్లాడిన వీడియో క్లిప్పింగులను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు.
నాలుగేళ్లపాటు ఎందుకు పోరాటం చేయలేదని కొంతమంది తనను ప్రశ్నిస్తున్నారన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, అభివృద్ధి ఆగడానికి వీల్లేదని ఆలోచించానన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయమై ఎక్కడా రాజీ పడకుండా ప్రయత్నాలు కొనసాగించామన్నారు. చివరికి ఐదో బడ్జెట్ లో కూడా అన్యాయం జరిగేసరికి, కేంద్రంపై పోరాటం మొదలుపెట్టామనీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాము కేంద్రంపై అవిశ్వాసం పెడితే, ఏకపక్షంగా రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయనీ, ఇదీ టీడీపీ సత్తా అన్నారు.
ఏపీకి హోదా హామీ ఇవ్వలేదని ఇప్పుడు భాజపా నేతలు అంటున్నారని, ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఉన్నపళంగా పవన్ కల్యాణ్ కూడా టీడీపీ సర్కారుపై విరుచుకుపడ్డారన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు భాజపాపై ఈగ వాలనీయడం లేదన్నారు. అవినీతిపరుల్ని అడ్డం పెట్టుకుంటే, రేప్పొద్దున్న వారు ఆడమన్నట్టు ఆడుతారనే ఉద్దేశంతో కొందర్ని చేరదీస్తున్నారని వైకాపాని ఉద్దేశించి విమర్శించారు. తమిళనాడు తరహాలోరాజకీయాలు చేస్తే తెలుగువారు సహించరనీ, అందుకే కర్ణాటక ఎన్నికల సందర్భంగా భాజపాకి వ్యతిరేకంగా ఓటెయ్యాలని అక్కడి తెలుగువారికి పిలుపునిచ్చామన్నారు. తాను కేంద్రంతో పోరాడుతూ ఉంటే కొంతమంది అవినీతిపరులు ప్రధాని కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారన్నారు.
జూన్ నుంచి నిరుద్యోగ భృతి అమలు చేస్తున్నామని ఈ సందర్బంగా ప్రకటించారు. నదులు అనుసంధానం చేశామనీ, రాయలసీమకు నీళ్లిచ్చామనీ, కియా, ఫాక్స్ కాన్, సెల్ కాన్ వంటి పరిశ్రమలు వచ్చాయన్నారు. ఇంకోపక్క, రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. కేంద్రానికి రాష్ట్రం సాయం చేయకపోయినా.. మన కష్టంతో అభివృద్ధి చేసుకుంటున్నామనీ, రాష్ట్రం కోసం ఇంకా చాలా చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రం సాయం లేకపోయినా ఎక్కడా ఆగకూడదనే ఉద్దేశంతోనే అన్ని రకాలుగా కష్టపడుతున్నామన్నారు. ఇదంతా రాష్ట్రం కోసం చేసిన ప్రయత్నమా కాదా చెప్పాలంటూ ప్రజలను కోరారు. చివరిగా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, దుగిరాజపట్నం పోర్టు.. ఇలా కేంద్రం ఇస్తామన్న వాటిని ప్రజలతోనూ డిమాండ్ చేయించారు.