పక్కవాడి ప్లేట్లో తిండి కోసం ఆశ పడితే.. ఉన్న ప్లేట్లో తిండి నేల పాలవుతుంది. జగన్ కు ఇది తెలిసినట్లు లేదు. టీడీపీ ఓటు బ్యాంక్ కోసం ఆశ పడుతూ.. తన ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టుకుంటున్నారు. వైసీపీ … వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను బేస్ చేసుకుని ఏర్పడింది. ఆయన పాలన దేవుడి పాలన అంటూ.. ఆ పార్టీ ప్రచారం చేసుకుని.. ఓటు బ్యాంక్ కాపాడుకుంటోంది. వైఎస్ లీడర్ గా ఎదగడానికి మొదట తలపడింది ఎన్టీఆర్ తోనే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్… తీవ్రమైన విమర్శలు చేసేవారు.అందులో వ్యక్తిగతమైనవి ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ పై వైఎస్ తన వ్యతిరేక భావాన్ని వదలి పెట్టలేదు. బేగంపేట విమాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఉండేది. శంషాబాద్ లో కొత్త విమాశ్రయం ప్రారంభోత్సవ సమయంలో.. ఎన్టీఆర్ పేరు పెట్టాల్సి ఉంది. కానీ వైఎస్ రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా శంషాబాద్ ఎయిర్ పోర్టులోని డొమెస్టిక్ టర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టారు.
టీడీపీకి అండగా ఉండే సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకే జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎన్టీఆర్ అంటే తెలుగువారందరికీ అభిమానం. సహజంగా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేతలకు అభిమానం ఎక్కువ ఉంటుంది. ఎన్టీఆర్ తమ సొత్తు అని టీడీపీ అనుకుంటుంది. తెలుగుదేశానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమమైన ఎన్టీఆర్ ను స్మరించుకోవంతోనే ప్రారంభిస్తారు. అలా ఓ పార్టీకి మూలపురుషునిగా ఉన్న వ్యక్తిని ప్రతిపక్ష పార్టీ అధినేత పొగడటం… రాజకీయాల్లో కీలక మలుపే. గతంలోనూ ఓదార్పు యాత్ర లాంటి ఒకటి రెండు సందర్భాల్లో… ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. ఎన్టీఆర్ కు అమితమైన ప్రాధాన్యం ఇస్తే… ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సూచనలు పార్టీ నుంచి రావడంతో ఆయన సైలెంటయిపోయారు.
ఇప్పుడు మళ్లీ జగన్ చేసిన ప్రకటన వైసీపీలోనూ కలకలం రేపుతోంది. ఇప్పుడు వైసీపీ అంటే.. వైఎస్. టీడీపీ అంటే ఎన్టీఆర్. ఒక పార్టీ వారు మరొక నేతను అభిమానించే పరిస్థితి లేదు. అలాంటప్పుడు.. ఎన్టీఆర్ ను యుగపురుషునిగా గుర్తిస్తే ఓటు బ్యాంక్ కు గండి పడుతుందని…. ఇలాంటి సెంటిమెంట్ తో కూడిన వ్యవహారాల వల్ల వైసీపీకే నష్టమని ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి బలహీనత మీద దెబ్బకొట్టాలి కానీ.. ప్రత్యర్థి బలం పెంచడానికి ప్రయత్నించడమేమిటని వైసీపీ వ్యూహకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఎన్టీఆర్ ను పొగిడినంత మాత్రాన..ఓ జిల్లాకు పేరు పెడతామన్నంత మాత్రాన.. టీడీపీ ఓటు బ్యాంక్ … తమ వైపు వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందంటున్నారు. అదే సమయంలో ఇది వికటిస్తే… వైఎస్ ..ఇమేజ్ తగ్గిపోతుందని.. ఫలితంగా వైసీపీ ఓటు బ్యాంక్ ను కరగదీస్తుందని భావిస్తున్నారు.