తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచడం లేదని కేంద్రం నేరుగా చెప్పేసింది. కానీ కొద్ది రోజుల క్రితం రెండు రాష్ట్రాలకు… కేంద్ర హోంశాఖ నుంచి ఓ లేఖ వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ కోసం.. కేంద్రం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపింది. ఈ ఏడు మండలాలు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి. ఇవన్నీ భద్రాచలం ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఎమ్మెల్యే మాత్రం తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్లీ సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఆ ఏడు మండలాల సంగతి తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఏడు మండలాలతో ఏపీలో ఓ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి. అది ఎస్టీ నియోజకవర్గం కాబట్టి… మళ్లీ రిజర్వేషన్ల విషయాన్నీ పరిశీలించాలి. ఒక ఎస్టీ సీటు ఏపీలో పెంచాలంటే.. చాలా కసరత్తే చేయాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణలో తగ్గించాలంటే.. కూడా అదే స్థాయి కసరత్తు చేయాలి.
ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం… ఈ ఏడు మండలాలతో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గాన్ని అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో కలపాలని… భావిస్తున్నారు. అయితే ఇందులోనూ చిక్కులున్నాయి. అందుకే న్యాయశాఖ సలహా తీసుకున్నారు. వారి సలహా మేరకు ముందడుగు వేస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కొన్ని అంశాలపై స్పష్టత కోసం లేఖలు రాశారు. అయితే తెలుగు రాష్ట్రాలు.. ఈ ఒక్క అంశం కాదు.. మొత్తం చట్టంలో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన సంగతి తేల్చాలని పట్టుబట్టే అవకాశం ఉంది.
దీంతో ఇదంతా తేలికగా కాదని ఈసీ అధికారులు భావిస్తున్నారు. ఓ రాష్ట్రంలో సీటు తగ్గించి..మరో రాష్ట్రంలో పెంచాలంటే.. సవాలక్ష చిక్కులుంటాయి. ప్రస్తుతానికి ఎన్నికల అధికారులు విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం.. ఏపీలో కలిసిన ఏడు మండలాల ప్రజలూ.. తెలంగాణ ఓటర్లుగా చూపిస్తున్నారు. ఏపీ పాలనలో ఉండి..వారు తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే స్థానానికి ఓటు వేయాల్సి వస్తే.. అది పరిష్కరించలేని వివాదమే అవుతుంది. ఒక వేళ… ఈ విషయంపై క్లారిటీకి రాలేకపోతే మరింత గందరగోళం తలెత్తుతుంది. ఏపీ ప్రజలు..తెలంగాణ ఎమ్మెల్యేను ఎలా ఎన్నుకుంటారన్న …అంశం సమస్యాత్మకంగా మారిపోయే అవకాశం ఉంది. ఏ ప్రాతిపదికన చూసినా… ఓ అసెంబ్లీ సీటును తెలంగాణకు తగ్గించి.. ఏపీకి పెంచక తప్పని పరిస్థితి ఉంది. ఈ చిక్కుముడిని ఈసీ ఎలా విడదీస్తుందో చూడాలి. చేయలేకపోతే.. అంతకన్నా చేతకాని తనం ఏమీ ఉండదు.