అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాకి ప్రజెంటర్. ‘ఆరెంజ్’ తరవాత సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మానేసిన ఆయన మళ్ళీ ఈ సినిమాతో ప్రొడక్షన్లోకి వచ్చినట్టే. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మీడియాపై బ్యాన్, అభిమానుల ఆవేశం, మెగా ఫ్యామిలీపై విమర్శలు, తదితర విషయాల గురించి నాగబాబుతో ఇంటర్వ్యూ…
– ‘ఆరెంజ్’ తరవాత ప్రొడక్షన్ అంటే భయం వేసిందా?
‘ఆరెంజ్’తో ప్రొడక్షన్‌పై ఇంట్రెస్ట్ తగ్గింది. నేను అన్‌ఫిట్ అనుకున్నా. ముఖ్యంగా రామ్‌చరణ్‌కి సక్సెస్ ఇవ్వలేకపోయానని ఎక్కువ బాధపడ్డా. ప్రొడక్షన్ అంటే భయం అనడం కంటే… ఫిల్మ్ మేకింగ్ వద్దని అనుకున్నా. నటుడిగా బిజీ కూడా అయ్యా. అయితే… ‘ఆరెంజ్’ తర్వాత అల్లు అరవింద్‌గారు బన్నీతో సినిమా చేయమని అన్నారు. ‘దేశముదురు’ నేను చేయాలి. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మళ్లీ నేనూ ఆయన్ను సినిమా అడగలేదు. మూడేళ్ల కిత్రం మళ్లీ ఆయనే పిలిచి లగడపాటితో ఈ సినిమా చేయమన్నారు. సినిమా ఇవ్వడం కంటే ముఖ్యంగా… మళ్లీ నేను సినిమా చేయలేనని నాలో కాన్ఫిడెన్స్ నింపారు.
– ‘ఆరెంజ్’తో ఎకనామికల్‌గా ఇబ్బంది పడ్డారని…
అన్నయ్య (చిరంజీవి), కల్యాణ్ బాబు (పవన్ కల్యాణ్) ఎకనామికల్‌గా సేవ్ చేశారు. దాంతో సేఫ్ అయ్యా. తరవాత ‘జబర్దస్త్’ షో, సినిమాల్లో క్యారెక్టర్స్ వల్ల సెటిల్ అయ్యాను.
– ప్రజెంటర్‌గా సినిమా మేకింగ్‌లో ఎంతవరకూ ఇన్వాల్వ్ అయ్యారు? సెట్‌కి వెళ్లారా ?
నన్ను సినిమా చేయమనేసరికి స్టోరీ, డైరెక్టర్ ఫిక్స్. అయినా ఒకసారి కథ వినమన్నారు. వక్కంతం వంశీ వచ్చి కథ చెప్పాడు. బన్నీకి టైలర్‌మేడ్ క్యారెక్టర్. ‘క్యారెక్టర్ని వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే. చావు రాక ముందు చచ్చిపోవడమే’ అని ట్రైలర్లో డైలాగ్ వుంది కదా! అదే హీరో క్యారెక్టర్. పర్సనల్‌గా నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక, సెట్స్ కి వెళ్లడం అంటారా? నిర్మాతలు ప్రతిరోజూ సెట్‌కి వెళ్లాల్సిన పని లేదు. పెద్ద హీరోల సినిమాలకు ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం జరుగుతాయి. ఈ సినిమాకి మా ‘బన్నీ’ వాసు ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నాడు.
– టీజర్, ట్రైలర్ చూస్తుంటే సీరియస్ సినిమాలా వుంది?
బన్నీ క్యారెక్టర్ సీరియస్‌గా వుంటుంది. తను కామెడీ చేయడు. కాని తన చుట్టుపక్కల వున్నవాళ్లు కామెడీ చేస్తారు. బన్నీ సీరియస్ లోనుంచి కామెడీ జనరేట్ అవుతుంది. సినిమాలో లవ్, యాక్షన్, సెంటిమెంట్ వుంటాయి.
– అల్లు అరవింద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమాపై కుట్ర జరుగుతుందని చెప్పారు. అదేంటి?
సినిమా విడుదలకు ముందే కొంతమంది బాగోలేదని నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు. విడుదలయ్యాక రాస్తే ఓకే. చూడకముందు అలా చేయడం ఏంటో అర్థం కావడం లేదు. మేమంతా బాధపడ్డాం. ఎవరో ఏదో చేస్తున్నారని ఆయనకు డౌట్ వచ్చింది. అందుకే ఆయన అలా మాట్లాడారు.
– ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన పరిణామాల వల్ల మీడియాని బ్యాన్ చేస్తున్నారని అంటున్నారు. చిరంజీవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నార్ట?
మాకు అలాంటి ఆలోచన ఏదీ లేదు. లేనిది ఉన్నట్టుగా ఎలా చెప్తారు. బ్యాన్ చేయడానికి మేము ఏమైనా పెదరాయుళ్లమా? ఇండస్ట్రీ మంచికి ఏం చేయాలో ఆ మీటింగులో డిస్కషన్‌కి వచ్చాయి.
– మీ ఫ్యామిలీని తిట్టడం వల్లే మీరు, అరవింద్ బయటకు వచ్చి మాట్లాడారు. తరవాత పవన్ కల్యాణ్ ఫిల్మ్ ఛాంబర్‌కి వెళ్లారు. అంతకు ముందు మహిళా ఆర్టిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బయటకు రాలేదని ఒక విమర్శ!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) తరపున చాలామంది వచ్చి మాట్లాడారు. మేం వాళ్లతో టచ్‌లో ఉన్నాం. ఆ విషయంలో మహిళలు ఎక్కువమంది రియాక్ట్ అయ్యారు.
– మీ ఫ్యామిలీని ఎవరైనా విమర్శిస్తే మెగా ఫాన్స్ తిడుతున్నారు. వాళ్లను మీరు కంట్రోల్ చేయడం లేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు?
మెగా ఫాన్స్ ఎవరిని తిడుతున్నారు? మమ్మల్ని విమర్శించిన వాళ్లందర్నీ తిడుతున్నారా? లేదుగా. ఓ పరిధి దాటి పబ్లిసిటీ కోసం చీప్ పాలిటిక్స్ చేసేవాళ్లని తిడుతున్నారు.లైమ్ లైట్లో ఉండాలనే ఉద్దేశంలో కొందరు దాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్లను కూడా ఏమీ అనవద్దని చెప్పాం. ఇంకేం చేయాలి? అభిమానులకు ఇంటింటికీ వెళ్లి చెప్పాలా? మాకు వేరే పనులు లేవా? లక్షలాది అభిమానులు వున్నారు. మా కమ్యునికేషన్ పరిధి దాటిన వాళ్లను ఎలా కంట్రోల్ చేయగలం? కనీస అవగాహన లేకుండా మమ్మల్ని ఏదో అనాలని అంటున్నారు.
– సినిమాలకు వస్తే… ఈ సినిమా తరవాత ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తారా?
చేస్తాను. మళ్లీ ఎప్పుడు తీస్తారు? అంటే చెప్పలేను.
– నటుడిగా ఏం చేస్తున్నారు?
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాలో పది నిమిషాల క్యారెక్టర్ చేస్తున్నా. స్టార్టింగులో వస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గీత గోవిందం’ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నా.