ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం వద్ద కె.ఎల్.యు (కోనేరు లక్ష్మయ్య డీమ్డ్ యూనివర్సిటీ)ని స్వయంగా పరిశీలించారు. అంతకు ముందు మంగళగిరిలోని హాయ్ లాండ్ను చూశారు.మరో రెండు ప్రాంతాలను చూసిన తర్వాత ప్రభుత్వానికి స్పీకర్ ప్రతిపాదనలు పంపుతారు.
భద్రత అంశంతో పాటు రవాణా సౌకర్యం, వసతి సదుపాయాలు, రహదారులు తదితర అంశాలనుకూడా పరిగణనలోకి తీసుకుని అసెంబ్లీ సమావేశాల స్ధలంపై నిర్ణయం తీసుకుంటారు.
తాత్కాలిక రాజధాని నిర్మాణం పూర్వయ్యేవరకు మన రాష్ట్రంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవాల్సి వుందని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. హాయ్ లాండ్ను సందర్శించిన బృందం ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేసింది. కె.ఎల్.యు.వర్సిటీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించకపోయినా అధికారులు, ప్రజాప్రతినిధులు బస చేసేందుకు వినియోగించుకునే అవకాశం ఉంది. చంద్రబాబు నివాసానికి దగ్గరలో ఆహ్లాదకర వాతావరణం కలిగిన కె.ఎల్.యు.కే మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.