మహానటిలో ఎన్టీఆర్ పాత్ర కోసం జూనియర్ని సంప్రదించిన సంగతి తెలిసిందే. కానీ ఎన్టీఆర్ అంగీకరించలేదు. అశ్వనీదత్ ఎంత బతిమాలాడినా.. ఎన్టీఆర్ ససేమీరా అన్నాడు. ఎన్టీఆర్ కోసం ఎదురుచూసీ ఎదురుచూసీ.. ఆ పాత్రని అలాగే వదిలేసుకోవాల్సివచ్చింది. ఎన్టీఆర్ పాత్రని ఎందుకు చేయలేదో.. `మహానటి` ఆడియో ఫంక్షన్లో వివరణ ఇచ్చుకున్నాడు ఎన్టీఆర్. ”స్వప్న నాకు మంచి స్నేహితురాలు. తను అడిగితే ఏదీకాదనలేదు. ఓసారి నా దగ్గరకు వచ్చి తాతయ్య పాత్ర చేయమని అడిగింది. నేను ఒప్పుకోలేదు. తాతయ్య పాత్ర చేసే ధైర్యం, దమ్ము నాకు లేవు. ఈ జన్మకురావు. మన కళ్ల ముందు తిరిగిన ఓవ్యక్తి జీవిత పాత్రని పోషించడం సులభం కాదు. కీర్తి సురేష్, సల్మాన్ దుల్కర్, సమంత ఆ సాహసం చేశారు. వాళ్లని అభినందిస్తున్నా” అన్నాడు. సావిత్రి కథ ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ సినిమా చూశాక ఆడవారిపై గౌరవం కలుగుతుందన్నాడు ఎన్టీఆర్. ”ఈమధ్య సమాజంలో ఆడవాళ్లపై కొన్ని అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ సినిమా చూస్తే మాత్రం ఆడవాళ్లపై గౌరవం పెరుగుతుంది. మగాడిగా ఎందుకు పుట్టామా అనిపిస్తుంది” అని ఉద్వేగంగా మాట్లాడాడు ఎన్టీఆర్.