మహానటిలో హీరోయిన్ కీర్తి సురేష్ కావొచ్చు. కానీ… అందరి దృష్టీ సమంతపై పడిపోయింది. నిన్నా మొన్నటి వరకూ ఈ సినిమాలో సమంతది సపోర్టింగ్ రోల్ అనుకున్నారంతా. కానీ.. ‘మహానటి’ ఆడియో ఫంక్షన్ చూస్తే.. అందులోని వక్తల మాటలు వింటే… ఈ సినిమాలో చిన్న పాత్ర చేసినా సరే, ఫోకస్ అంతా సమంత తన వైపుకు తిప్పుకుందేమో అనిపిస్తోంది. ఈ చిత్రంలో మధురవాణిగా నటించింది సమంత. ఆమె స్క్రీన్ స్పేస్ చిన్నదే. కానీ.. తనకు దొరికిన సమయంలోనే మ్యాజిక్ చేసేసిందట. మరీ ముఖ్యంగా ఒకే ఒక్కసీన్‌లో సమంత నటన అపూర్వమని చెబుతున్నారు. ఈ విషయాన్ని రచయిత బుర్రా సాయిమాధవ్ సైతం చెప్పుకొచ్చారు. సమంత కూడా తన స్పీచ్‌లో ఆ సీన్ గురించి వివరించింది. కేవలం ఆ సీన్ కోసమే ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందట సమంత. ఆ సీన్ కోసమే తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పుకుందట. ”ఆ సీన్ ఏడెనిమిది టేకుల్లో చేసుంటా. ప్రతీసారీ గ్లిజరిన్ వాడకుండానే కన్నీళ్లొచ్చాయి” అంటూ ఉద్వేగంగా చెప్పుకొచ్చింది సమంత. కీర్తి సురేష్ కూడా.. “ఈ సినిమాలో హీరోయిన్ నేనే కావొచ్చు. కానీ ఈ సినిమా మొత్తాన్ని నడిపించేది సమంతనే“ అంది. మరి సమంత ఏ స్థాయిలో విజృంభించిందో, సమంత విజృంభించిన ఆ సీన్ ఏమిటో తెలియాలంటే ఈనెల 9 వరకూ ఆగాలి.