జనసేన అధినేత పవన్ కల్యాణ్ షాట్ గ్యాప్ పాలిటిక్స్…కమ్యూనిస్టు పార్టీ నేతలకు విసుగు తెప్పించాయి. ప్రతి రోజూ.. ఏదో ఓ కార్యక్రమం పెట్టుకుని రోడ్ల మీద వెళ్లక పోతే.. ఎర్రన్నలకు నచ్చదు. అలా వెళ్తే.. వారి వెంట వచ్చే వారు పట్టుమని పది మంది కూడా ఉండరు. అదే పవన్ కల్యాణ్ అనే బ్రాండ్ తమ వెనుక ఉంటే.. వెనుక వెయ్యి మంది వస్తారనే నమ్మకం వారిది. అందుకే పవన్ కల్యాణ్ గేట్ల ముందు పడిగాపులు పడేలా చేసినా… తనకు అవసరం వచ్చినప్పుడే పిలిచినా.. రెండు కమ్యూనిస్టు పార్టీల ముఖ్య నేతలిద్దరూ… పరుగుపరుగున వెళ్లారు. మొదట్లో వారి పోరాటాలపై తనకెంతో గౌరవం ఉందని.. వారు గొప్ప వాళ్లని చెప్పుకొచ్చిన పవన్ తర్వాత్తర్వాత.. లైట్ తీసుకోవడం ప్రారంభించారు. ఇప్పుడసలు లెక్కలోకి తీసుకోవడం లేదు.
కొన్నాళ్ల క్రితం…కమ్యూనిస్టు పార్టీలతో కలిసి.. రాయలసీమ, ఉత్తరాంధ్ర,ప్రకాశం జిల్లాల్లో మేథావుల సమావేశాలు పెట్టి.. ఓ రేంజ్ ఉద్యమం నిర్మిస్తామని చెప్పారు. తర్వాత శ్రీరెడ్డి వివాదం.. ఆ తర్వాత పవన్ ట్వీట్ల మాయలో పడిపోవడంతో.. అవన్నీ పక్కకుపోయాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ కొత్త పోరాట బాట ప్రకటించారు. ఇందులో కమ్యూనిస్టు పార్టీల ప్రస్తావన లేదు. వారితో ఉమ్మడి పోరాటాల విషయం లేదు. పది రోజుల్లో తన జిల్లాల యాత్ర షెడ్యూల్ ప్రకటిస్తానని..హోదా కోసం.. విభజన హామీల కోసం ఉద్యమిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ… ఎర్రజెండా గురించి మాత్రం మర్చిపోయారు. అదే సమయంలో తాను 175 నియోజకవర్గాల నుంచీ పోటీ చేస్తానని చెప్పారు. ఈ సందర్భంలోనూ ఆయనకు కమ్యూనిస్టు పార్టీలు గుర్తుకు రాలేదు.
మరో వైపు కమ్యూనిస్టులు కూడా .. పవన్ వ్యవహారశైలిపై అసంతృప్తిగానే ఉన్నారు. ఏదో సినిమా స్టార్ అన్న క్రేజ్ తో జనం వస్తారనేగాని.. ఆయనకు సిద్దాంతాల నమ్మకం లేదని.. రామకృష్ణ, మధు లాంటి నేతలు… తమ పార్టీ అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారట. శ్రీరెడ్డి ఇష్యూతో పవన్ మెంటాలిటీ బయటపడంతో.. వారు.. కూడా.. పవన్ తో పెట్టుకోకపోవడం బెటరని డిసైడయ్యారట. ఎవరి పంథాలో వాళ్లు పోరాటం చేసుకుంటే.. ఎన్నికల సమయానికి సీట్లిచ్చేవారంటే ట్రై చేసుకుందామని డిసైడయ్యారట. అందుకే.. సీపీఐ నేతలు.. తమ పాతమిత్రుడు వైసీపీతో కలిసి విశాఖలో ర్యాలీల్లో పాల్గొన్నారు. వంచన వ్యతిరేకదీక్షకు సీపీఐ కూడా సంఘీభావం తెలిపింది. అవినీతి పార్టీ దగ్గరకు తాము వెళ్లమనేదే.. సీపీఎం సిద్ధాంతం..మొదటి నుంచి.
మొత్తానికి పవన్ కల్యాణ్ వద్దనుకున్నారో… కమ్యూనిస్టులే దూరం జరిగాలో కానీ.. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. మళ్లీ పవన్ కు ఎర్రజెండా గుర్తుకు వస్తే దగ్గరవుతారేమో కానీ… అది ఆ సాన్నిహిత్యం .. అప్పడు జరిగే ఈవెంట్ వరకే ఉంటుందనేది అందరికీ తెలిసిన రాజకీయం.