ఇన్నాళ్లూ ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్టుగా మారింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్! కర్ణాటక ఎన్నికల్లో మోడీ ప్రచారం మొదలైంది. ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా, చివరికి ఎక్కడైనా ఒక ఉప ఎన్నిక ఉన్నా కూడా ప్రధాని స్థానంలో ఉన్న మోడీ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఆయన ప్రచారానికి వస్తే భాజపాకి విజయం తథ్యం అన్నట్టుగా భాజపా శ్రేణులు ధీమాగా ఉండేవి. కానీ, ఆ ధీమా ఇప్పుడు మారింది. ఎందుకంటే, కర్ణాటక ఎన్నికలకు వచ్చేసరికి.. మోడీ ఇమేజ్ వేరేలా ఉంది. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు స్పష్టమైపోయాయి. అన్నిటికీ మించి, ఏవైతే చారిత్రం అనుకుని మోడీ సర్కారు చెప్పిన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు ఘోరంగా ఫెయిలయ్యాయి. దీంతో సామాన్యుల్లో మోడీపై ఆగ్రహం నెలకొంది. ఇంకోపక్క, గుజరాత్ ఎన్నికలు, రాజస్థాన్ ఉప ఎన్నిక, ఉత్తరప్రదేశ్ లో ఉప ఎన్నిక… ఇలా భాజపాకి బలముంది అనుకున్న చోటే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల బరిలోకి మోడీ దిగారు. దక్షిణాదిలో జెండా పాతేస్తామన్నట్టుగా ప్రసంగిస్తున్నారు. కర్ణాటకలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ సిద్ధరామయ్య సర్కారుపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే, మోడీ ప్రసంగాలకు వెంటనే కౌంటర్లు పడిపోతున్నాయి. ఓ పక్క నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ… కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లో భాజపా అధికారంలోకి రాదని ధీమాగా అభిప్రాయపడుతున్నారు. సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ… భాజపా పాలిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేస్తున్నారు. ఈ సవాలుకి భాజపా నుంచి సమాధానం లేదు. ఎందుకంటే, తాజాగా యూపీ లాంటి రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఘటనలు కొన్ని ఉన్నాయి కదా.
ఇక, నిన్నమొన్నటి వరకూ భాజపాకి కొంత అనుకుమైన వాతావరణం ఏర్పడుతోందన్న సర్వేలు కూడా ఇప్పుడు మారిపోయాయి. జెడీయస్ కీలకం కాబోతోందని కూడా సర్వేలు చెప్పుకొచ్చాయి. కానీ, తాజా సర్వేలు మాటేంటంటే… కాంగ్రెస్ దే విజయం అంటున్నాయి. మోడీ రాక నేపథ్యంలో సర్వేల ఉధృతిని పెంచడం కూడా సిద్ధరామయ్య వ్యూహంలో భాగమనీ చెప్పుకోవచ్చు. కర్ణాటకలో ఉన్న తెలుగువారికి తాజాగా సిద్ధరామయ్య ఓ లేఖ రాశారు. తెలుగువారి సొంత రాష్ట్రం ఆంధ్రాపై భాజపా ఎలా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందో మీకే తెలుసని, అలాంటి పార్టీ కర్ణాటకను అభివృద్ధి చేస్తుందంటే ఎవరు నమ్ముతారంటూ ఆ లేఖలో సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో స్థిరపడ్డ తెలుగువారు, తమిళులు భాజపాకి వ్యతిరేకంగా ఓటేస్తారన్నది దాదాపుగా స్పష్టంగానే ఉంది. ఇంకోపక్క, భాజపా సహజ సిద్ధమైన మతం కార్డుకు కూడా అవకాశం లేకుండా లింగాయత్ ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇలా ఏరకంగా చూసుకున్నా.. భాజపాకి ఎక్కడా ఎలాంటి అవకాశమూ ఇవ్వకూడదన్న పక్కావ్యూహంతో కాంగ్రెస్ ఉంది. వీటిని దాటుకుంటూ మోడీ ప్రచారం సాగాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మోడీ హవా దక్షిణాదిన వీస్తుందా లేదా అనేది ఇప్పుడు భాజపాకి పెద్ద సవాలే.