ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. రాజకీయసభలు అంటే…ప్రాసలతో కూడిన విమర్శలతో ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. కర్ణాటకలోనూ అదే చేయబోయారు. కానీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య… క్షణాల్లోనే రివర్స్ పంచ్‌లు ఇస్తున్నారు. దాంతో.. మోదీ వర్సెస్ సిద్ధరామయ్య.. మాటల మంటలు.. హాట్ టాపిక్‌గా మారిపోతున్నాయి. ఈ క్రమంలో సిద్ధరామయ్య ఇచ్చే పంచ్‌లకు బీజేపీ దగ్గర సమాధానాలు ఉండటం లేదు.
మోదీ ప్రచారం ప్రారంభించిన రోజే.. దేవేగౌడను రాహుల్ అవమానించారంటూ.. సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. దానికి కాస్తంత “కన్నడ ప్రైడ్” సెంటిమెంట్ టచ్ కూడా ఇచ్చారు. దీనికి వెంటనే సిద్ధరామయ్య… కౌంటర్ వచ్చారు. యడ్యూరప్ప సగం వంగిపోయి… మోదీ చేతులు పట్టుకున్నా.. ఆయన పట్టించుకోని ఫోటోను ట్వీట్ చేసి… ఇదేనా మీరు చెప్పే కన్నడ ప్రైడ్ అంటూ ప్రశ్నించారు. దాంతో… రివర్స్ ట్వీట్ చేయడానికి బీజేపీ దగ్గర సరుకు లేకపోయింది. దీంతో వదిలి పెట్టలేదు సిద్ధరామయ్య… దేవేగౌడకు అంత గౌరవం ఇస్తామన్నారు సరే.. బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతామని రాహుల్‌ను టార్గెట్ చేసి మోదీ చేసిన కామెంట్స్.. ఇపుడు బీజేపీకి సమర్థించుకోలేనిదిగా మారింది.
ఇదే కాదు పావు గంట ప్రసంగం విషయంలో.. రాహుల్ పై మోదీ చేసిన సవాల్‌కు సిద్ధరామయ్య డైరక్ట్ కౌంటర్ ఇచ్చారు. మోదీ పేపర్ మీద రాసుకొచ్చి అయినా సరే యడ్యూరప్ప పాలనలో చేసిన పనుల గురించి మాట్లాడాలంటూ సవాల్ చేశారు. సిద్ధరామయ్య దూకుడు కాంగ్రెస్ నేతల్లో ఎక్కడ లేని ఉత్సాహన్ని నింపుతోంది. యడ్యూరప్ప నుంచి.. మోదీ వరకు ఎవరు వచ్చి విమర్శలు చేసినా.. సిద్ధరామయ్య నుంచి కౌంటర్ పడాల్సిందే. సిద్ధరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారని ఆయనకు ఓటమి భయం పట్టుకుందని మోదీ మొదటి విమర్శ అలా చేసీ చేయగానే… మరి 56 ఇంచ్‌ల చాతి ఉన్న మీరు.. గత ఎన్నికల్లో రెండు స్థానాలను ఎందుకు పోటీ చేశారని… ఇచ్చిన కౌంటర్‌కు మోదీకి కూడా మైండ్ బ్లాంక్ అయిపోయింది. కన్నడనాట ప్రచారంలో.. మోదీని మించి సిద్ధరామయ్యే ఇప్పుడు సూపర్ స్టార్.