చిత్రసీమలో కాంపౌండ్ల గోల లేనివాళ్లు, కాస్ట్ ఫీలింగ్ తో చూడాల్సిన పనిలేనివాళ్లు, అందరికీ కావాల్సినవాళ్లు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటివాళ్లలో బి.ఏ రాజు ఒకరు. రాజుని టాలీవుడ్‌లో హీరోలు, నిర్మాతలు, దర్శకులు కేవలం పీఆర్వోగా చూడరు. ఇంట్లో మనిషిలా భావిస్తారు. ఆయనా తనని తాను పీఆర్వో అనుకోరు. ఆ సినిమాకి పనిచేస్తున్న వాళ్లలో తాను ఒకడిగా మారిపోతారు. నిర్మాత కష్టసుఖాల్లో, దర్శకుడి ఆలోచనల్లో, ఆఖరికి ఆ హీరో ఇమేజీలో తానూ వాటా అందుకుంటారు. అందుకే అందరికీ ఆయనేకావాలి.. అందరితోనూ ఆయన ఉండాలి. కాబట్టే దశాబ్దాలుగా ఈ రంగంలో ఉండగలుగుతున్నారు. వందలాది చిత్రాల ప్రచార బాధ్యతని తనపై వేసుకుని.. ఇప్పటికీ స్టార్ పీఆర్వోగా కొనసాగుతున్నారు. `ఈ సినిమాకి నేను పీఆర్వో కాదు కదా` అని ఏ సినిమానీ తక్కువ చేయరు, ఎవరి గురించీ తక్కువగా మాట్లాడరు. అది వ్యక్తులపై గౌరవంతో కాదు. అన్నంపెడుతున్న పరిశ్రమపై తనకున్న ప్రేమతో! అదే రాజులోని స్పెషాలిటీ. కాబట్టే ఇప్పటికీ.. ఆయన అందరివాడుగానే చలామణీ అవుతున్నారు.
బీఏ రాజుని కేవలం పీఆర్వోగానే చూడలేం. ఆయన ప్రయాణం జర్నలిస్టుగా మొదలైంది. `సూపర్ హిట్` అనే పత్రిక స్థాపించి.. తానే ఓ సైనికుడిగా, శ్రామికుడిగా చమటోడ్చి… ఆ పత్రికను శిఖరాగ్రాన నిలబెట్టారు. నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టి.. అందులోనూ విజేతగా నిలిచారు. లవ్ లీ లాంటి సూసర్ హిట్ సినిమాల్ని తన ఖాతాలో వేసుకున్నారు. దశాబ్దాలుగా బిఏ రాజు చేస్తున్న సేవని ఇప్పుడు ఫాస్ సంస్థ దాసరి లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డుతో బీఏ రాజుని సత్కరించబోతోంది. ఈనెల 6న హైదరాబాద్ త్యాగరాయ గానసభలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజు అవార్డు అందుకున్నారు. ”దాసరి గారి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు అందుకోవడం సంతోషం కలిగించింది. ఇప్పుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కినందుకు ఆనందంగా ఉంది. సాటి అవార్డు గ్రహీతలకు అభినందనలు” అంటూ బీఏ రాజు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పీఆర్వోగా స్టార్‌డమ్ చూసిన రాజు.. మరిన్ని శిఖరాలు అధిరోహించాలని తెలుగు 360 మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఆల్ ద బెస్ట్ రాజు గారూ…!