జగన్ పాదయాత్ర చేస్తుంటే, అసెంబ్లీకి ఎమ్మెల్యేలనే వెళ్లనీయలేదు..! అలాంటిది, ఇప్పుడు ప్రజాసంకల్ప పాదయాత్ర 150 రోజులకు చేరుకున్న దశలో, విశాఖపట్నం పరిధిలో పదిరోజులు పాదయాత్ర చేసేందుకు ఎంపీ విజయసాయి రెడ్డికి జగన్ అనుమతి ఇవ్వడం విశేషమే! వరుసగా పదిరోజులపాటు గ్రేటర్ విశాఖలోని 72 వార్డులను కలియబెడుతూ ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. ఇది అనూహ్యంగా తీసుకున్న నిర్ణయంగానే అనిపిస్తోంది. ఎందుకంటే, జగన్ పాదయాత్ర జరుగుతుంటే, వైకాపాలోని మరో నాయకుడు పాదయాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వడం అసాధ్యం. అంతెందుకు, రెగ్యులర్ పార్టీ కార్యక్రమాల్లో కూడా ‘జగన్ ఆదేశాల మేరకు’ అనే ట్యాగ్ లైన్ లేకుండా నేతలు మాట్లాడే సాహసమే చెయ్యరు. అలాంటప్పుడు, విజయసాయి పాదయాత్ర వ్యూహమేంటి..? పార్టీలో అప్రకటితంగా నంబర్ 2 గా ఉండే ఆయన, ఈ యాత్రతో దాన్ని ప్రకటితం చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు.
ఇక, విశాఖపై వైకాపా ప్రత్యేక దృష్టి కారణం.. రాబోయే ఎన్నికల వ్యూహమే అని చెప్పొచ్చు. గత సార్వత్రిక ఎన్నికల్లో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆమెను బరిలోకి దించడం ద్వారా ఉత్తరాంధ్రాలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతోపాటు తూర్పు గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో ఆమె ప్రభావం చూపగలరని భావించారు. కానీ, భాజపా అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో విజయమ్మ ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆమె ప్రభావం ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలపై కూడా పెద్దగా లేదని కూడా గత ఎన్నికల్లో తేలిపోయింది. సో.. మరోసారి అక్కడి నుంచే పార్టీని బలోపేతం చేసేందుకు విజయసాయి సిద్ధమయ్యారని అనుకోవచ్చు. అయితే, ఈయన ఈ క్రమంలో అక్కడి నుంచీ ఎంపీగా పోటీ చేస్తారా అనే అభిప్రాయం కూడా ఈ సందర్భంగా వినిపిస్తోంది. విశాఖను కేంద్రంగా చేసుకుంటే… ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టొచ్చనేది వైకాపా వ్యూహంగా ఉంది.
ఈ మధ్య అనూహ్యంగా విజయసాయి రెడ్డి పాత్ర పార్టీలో కీలకంగా మారింది. మొదట్నుంచీ తెర వెనకే ఉంటున్నా.. ఇప్పుడు తెర ముందుకొచ్చారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా పోరాటం దరిమిలా ఆయన ప్రముఖంగా వార్తల్లో ఉంటున్నారు. దీంతో ఇప్పటికే పార్టీలో సీనియర్లుగా ఉన్న కొంతమంది కాస్త గుర్రుగా ఉన్నారనే కథనాలూ ఈ మధ్య వినిపించాయి. మరి, విజయ సాయి పాదయాత్రకు జగన్ నుంచి అనుమతి లభించిందంటే… పార్టీలో ఆయన స్థానం ఏంటనేది అన్యాపదేశంగా వైకాపా వర్గాలకు స్పష్టం చేసినట్టే కదా. ఈ విశాఖ పాదయాత్ర నేపథ్యంలో ఇతర వైకాపా నేతల స్పందన ఏంటనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.