ఎన్నికల గడువు దగ్గరకు వచ్చే కొద్దీ.. కర్ణాటక బీజేపీలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంత మంది పార్టీ నేతలు వ్యతిరేకించినా… ఎన్నికలకు ముందే లింగాయత్ ఓట్లను ఆకట్టుకునే ఉద్దేశంతో యడ్యూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అనూహ్యంగా దీనికి సిద్దరామయ్య..లింగాయత్‌లకు మతం హోదా తీర్మానంతో కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారిగా బీజేపీకి వస్తుందనుకున్న అడ్వాంటేజ్ అంతా కాంగ్రెస్ వైపు వెళ్లిపోయింది. ఆ సమయంలో మళ్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని మారిస్తే… మొదటికే మోసం వస్తుందని.. మెల్లగా యడ్యూరప్పను సైలెంట్ చేయడం ప్రారంభించారు. అదే సమయంలో.. గాలి జనార్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీరాములును..తెరపైకి తెస్తున్నారు. ఎంపీలు ఎవరికీ బీజేపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు.
ఈ విషయంలో శ్రీరాములుకు మినహాయింపు ఇచ్చారు. ముందుగానే డిప్యూటీ సీఎం క్యాండిటేట్ అని ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం.. యడ్యూరప్పను పక్కన పెట్టేసి… శ్రీరాములే… ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నంతగా ప్రాధాన్యం ఇస్తున్నారు. యడ్యూరప్పను.. ప్రధానమంత్రి సభలకు అనుమతించడం లేదు. రావొద్దని.. యడ్యూరప్ప మొహం మీదే చెప్పేశారు. దాంతో ఆయన విడిగా ప్రచారం చేసుకుంటున్నారు. శ్రీరాములుకు మాత్రం బీజేపీ అగ్రనేతలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. బాదామి నియోజకవర్గంలో… సిద్ధరామయ్యపై శ్రీరాములునే అభ్యర్థిగా నిలబెట్టారు. అక్కడ సిద్దరామయ్యను శ్రీరాములు ఓడించి.. బీజేపీకి మెజార్టీ వస్తే… యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి ప్రమాణం చేయరని.. శ్రీరాములే ముఖ్యమంత్రి అవుతారని.. బీజేపీ వర్గాలు ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించాయి.
మరో వైపు.. కనీసం… బళ్లారి ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఇరవై అసెంబ్లీ సీట్లను గెలుచుకు వస్తానని… గాలి జనార్ధన్ రెడ్డి హైకమాండ్‌కు హామీ ఇచ్చారు. శ్రీరాములుకు గాలి జనార్ధన్ రెడ్డి ఎంత చెబితే అంత కాబట్టి.. ఇద్దరూ వేర్వేరని.. బీజేపీ హైకమాండ్ భావించడం లేదు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే యడ్యూరప్పను.. బీజేపీ పక్కన పెట్టేసినట్లే. గాలి వర్గానికి చెందిన శ్రీరాములను నెత్తిన పెట్టేసుకున్నట్లే…! అనూహ్య పరిణామాలు ఏమైనా ఉంటే… అవి ఎన్నికల తర్వాత బయటపడనున్నాయి.