జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం రాను రాను … పొట్టచెక్కలయ్యే కామెడీగా మారిపోతోంది. పీకే రాజకీయంలో ఎక్కడా సీరియస్‌నెస్ కనిపించడం లేదు. ఆయన “సమాజంలో కుళ్లుని కడిగేద్దాం..”అని ఆవేశంతో.. సినిమాల్లో సింగిల్ టేక్‌లో ఓకే చేసిన ఎమోషన్‌ను మిక్స్ చేసి… బలంగా అరచి చెప్పినా.. ఇప్పుడు ప్రజలు.. అదేదో కామెడీ అనుకుని నవ్వుకునే పరిస్థితి వచ్చింది. దేవ్ అలియాస్ వాసుదేవ్ అనే వ్యక్తిని చింతల్ బస్తీ నుంచి తీసుకొచ్చి నార్త్ ఇండియన్.. పొలిటికల్ పుడింగి అని ఫీలింగ్ కల్పించడానికి ప్రయత్నించడంతో పవన్ కల్యాణ్ వద్ద అసలు పొలిటికల్ మ్యాటర్ లేదని జనాల్లోకి వెళ్లిపోయింది.
నిజానికి పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ప్రభ ఓ దశలో వెలిగిపోయింది. నాలుగో వార్షికోత్సవ సభ వరకూ.. ఆయన ఏపీ రాజకీయాల్లో ఓ ధృవతారగానే కనిపించారు. కానీ ఎవరి మాటలు విన్నారో..? ఏం జరిగిందో కానీ… ఒక్కసారిగా నాలుగో వార్షికోత్సవ సభలో రాజకీయ విధానాన్ని మార్చేసుకున్నారు. అప్పటి వరకూ తనను వీఐపీలా చూసుకున్న ప్రభుత్వాన్ని… అర్థంపర్థం లేని ఆరోపణలతో విమర్శించారు. దాంతో టీడీపీకి, ప్రభుత్వానికి కడుపు మండిపోయింది. జగన్‌తో పోలిస్తే పవనే ఏపీకి ఎంతో మంచిదన్న ఉద్దేశంతో పవన్ కల్యాణ్ లెవనెత్తే సమస్యలన్నింటికీ.. ప్రభుత్వం పరిష్కారం చూపించింది. చాలా విషయాల్లో చిక్కులున్నప్పటికీ.. పవన్‌ను సంతృప్తి పరచడానికే ముందుకెళ్లింది. కానీ పవన్ కల్యాణ్ ప్రభుత్వ తీరును మరో రకంగా అర్థం చేసుకున్నారు. ఎవరెవరో వచ్చి చెప్పిన మాటలను నమ్మి… ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడంతో ఫేట్ మారిపోయింది.
అప్పట్నుంచి..పవన్ కల్యాణ్ రాజకీయంగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. అమరావతిలో తాను కొనుగోలు చేసిన రెండెకరాల స్థలం తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత టీడీపీ నేతలే ఆ విషయంపై వైసీపీపై విమర్శలు చేయడం ప్రారభించారు. దానికి పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు సమాధానం చెప్పుకోలేకపోయారు. ఆ తర్వాత ప్రత్యేకహోదా విషయంలో పూర్తిగా మాటమార్చి.. పేరు కాదు ముఖ్యం డబ్బులు రావాలని జాతీయ మీడియాకు ఇంటర్యూలిచ్చి మళ్లీ తేడాగా కనిపించారు. అప్పుడే మోదీ అంటే చాలా ఇష్టమని ప్రకటించారు. కానీ తిరుపతి, కాకినాడ, అనంతపురం జిల్లాల్లో సభలు పెట్టినప్పుడు… మోదీని ఎంత తీవ్రంగా విమర్శించారో ఇంకా ప్రజలకు గుర్తు ఉంది. దాంతో పవన్ కల్యాణ్‌కు రహస్య ఎజెండా ఉందన్న భావన ప్రజల్లో ఎర్పడింది. ఆ తర్వాత శ్రీరెడ్డి విషయంలో.. పవన్ కల్యాణ్ అత్యుత్సాహం వల్ల అప్పటి వరకు తన పార్టీకి తోడ్పాటునిచ్చిన మీడియాతో వైరం ఏర్పడింది. టాలీవుడ్‌ను కూడా రాజకీయాలకు వాడుకున్నారన్న భావన ఏర్పడింది. ఇప్పుడు జనసేన కార్యక్రమాలకు మీడియా కవరేజీ ఇవ్వడం కష్టమే. అది అలా ఉండగానే.. ఇప్పుడు వాసుదేవ్ అనే వ్యూహకర్త విషయంలో టోటల్‌గా జనసేన ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వస్తానని గత ఏడాదిగా చెబుతున్నారు. కానీ అన్నీ షాట్ గ్యాప్ టూర్లే.
పవన్ కల్యాణ్ ఈ రోజు చెప్పిన మాట మీద రేపు నిలబడతారన్న గ్యారంటీ లేకపోయింది. కమ్యూనిస్టులతో కలసిపోరాటమన్నారు..గుర్తొచ్చినప్పుడు మాత్రమే వారితో సమావేశమవుతారు. వారితో రాజకీయ బంధం ఎలా ఉంటుందో ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. ప్రతీ విషయంలోనూ.. పీకే మెచ్యూరిటీ లేని రాజకీయాలు చేస్తూండటంతో.. రాజకీయవర్గాల్లో కమెడియన్‌గా జనసేన మారిపోయింది. ఇప్పుడల్లా హీరో ఇమేజ్ తెచ్చుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు.