ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారిలో బహిరంసభలో ప్రసంగించబోతున్నాయని తెలియగానే అందరి మదిలోనూ రెండు అంశాలు మెదిలాయి. ఒకటి గాలి జనార్ధన్ రెడ్డి అవీనితి అంశంపై ఆయన ఏమంటారు..?. రెండు తెలుగు ఓటర్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నందున… వారి ఆగ్రహాన్ని, సెంటిమెంట్‌ను గౌరవిస్తూ ఏమైనా ప్రకటన చేస్తారా..?. అని అటు కర్ణాటకతో పాటు ఇటు ఏపీ ప్రజలు కూడా ఎదురు చూశారు. ఈ రెండింటింకీ ఆయన క్లారిటీ ఇచ్చారు. కకాపోతే.. అవి నరేంద్రమోదీ ఇమేజ్‌కు తగ్గవి కాదు. ఆయన సైజ్ ను తగ్గించేవే..!
గాలి జనార్ధన్ రెడ్డి అంటే ముందుగా ఎవరికైనా గుర్తుకు వచ్చేది.. అవినీతే. రాష్ట్రాల సరిహద్దులను కూడా కూల్చేసి… ఐరన్ ఓర్ ను తవ్వి విదేశాలకు తరలించి వేలకోట్లు వెనకేసుకున్నారు. అందుకే బళ్లారి అంటే అందరికి ముందుగా గాలి జనార్ధన్ రెడ్డి గుర్తుకు వస్తారు. అక్రమ మైనింగ్ గుర్తుకు వస్తుంది. అయితే బళ్లారి అంటే.. నీతినిజాయితీలకు మారు పేరు అని ప్రకటించి.. ఇన్ డైరక్ట్ గా గాలి జనార్ధన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇవ్వబోతున్న సందేశం పంపించారు. అవినీతిపై కాంగ్రెస్ పార్టీనే దుష్ప్రచారం చేస్తోందని చెప్పుకొచ్చారు. గాలి జనార్ధన్ రెడ్డి పరివారానికి బీజేపీ క్లీన్ చిట్ ఇచ్చేందుకు సీబీఐను రెడీ చేసిందన్న ఆరోపణలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. దీనిపై సంబంధించిన కొన్ని పత్రాలు కూడా బయటకు వచ్చాయి. దీనిపై బీజేపీ సైలెంట్ గా ఉంది. ఇప్పుడు నేరుగా ప్రధానమంత్రే.. గాలి జనార్ధన్ రెడ్డి నిజాయితీ పరుడన్నట్లుగా మాట్లాడారు. దీంతో ఇక టూజీ కేసులగా మైనింగ్ కేసు కూడా తేలిపోతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది.బళ్లారి ప్రచారంలో… నరేంద్రమోదీతో పాటు.. సోమశేఖర్ రెడ్డి కూడా వేదిక పంచుకున్నారు. బళ్లారి నుంచి పోటీ చేస్తున్న సోమశేఖర్ రెడ్డి.. గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు. ఈయనపై బెయిల్ కోసం జడ్జికి లంచం ఇవ్వబోయిన కేసు ఉంది.
అదే సమయంలో కర్ణాటకలో తెలుగు ఓటర్లు.. ఏపీపై కేంద్రం తీరుపై ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం జరుగుతున్నా..మోదీ పట్టించుకోలేదు. బళ్లారి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తెలుగు ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వారి ఆగ్రహాన్ని చల్లర్చడానికి మోదీ ఏదో ప్రయత్నం చేస్తారని… అంతా భావించారు. కానీ తెలుగు మూలాలున్న ఓటర్ల సెంటిమెంట్ ను మోదీ అసలు పట్టించుకోలేదు. కనీసం వారిని ఏదో మాటతో సముదాయించే ప్రయత్నం కూడా చేయలేదు. కర్ణాటకలో తెలుగు ఓటర్లు లేనట్లు.. వారి సెంటిమెంట్ తో పని లేనట్లు… మోదీ బళ్లారిలో వ్యవహిరంచారు. బీజేపీకి కోసం… ఏపీ బీజేపీ నేతలు, వైసీపీ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. వారందరికీ తెలుగు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనూ మోదీ సమస్య పరిష్కారానికి ఏదో ఒకటి చెబుతారని.. అక్కడి బీజేపీ నేతలు కూడా ఆశించారు. కానీ నిరాశే ఎదురయింది.
మొత్తంగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సరిహద్దుకు వచ్చిన మోదీ.. అవినీతి కేసుల్లో గాలి జనర్ధన్ రెడ్డికి భరోసా ఇచ్చారు. తెలుగు ఓటర్లను మాత్రం నిరాశ పరిచారు. కానీ ఇలా చేయడం ప్రధాని స్థాయికి తగ్గది కాదని.. బీజేపీ నేతలు ఊసూరుమంటున్నారు.