టీవీ ఛానళ్లని కంట్రోల్లో పెట్టడం ఎలానో తెలీక టాలీవుడ్ పెద్దలు జుత్తు పీక్కుంటున్నారు. మీడియాని దూరంగా పెట్టడం కష్టమన్న సంగతి వాళ్లకు తొలి అడగుల్లోనే అర్థమవుతోంది. అందుకే… కర్ర విరక్కుండా, పాము చావకుండా అన్న రీతిలో జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు చిత్రసీమ దృష్టి రివ్యూలపై పడినట్టు తెలుస్తోంది. ‘రివ్యూల్ని ఆపడం ఎలా?’ అనే విషయంపై ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు తీవ్రంగా చర్చించుకుంటున్నట్టు సమాచారం. రివ్యూల వల్ల సినిమాలకు మేలు జరగకపోగా, వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, వాటిని ఎలాగైనా ఆపాలని కొంతమంది నిర్మాతలు ఛాంబర్ దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఇటీవల జరిగిన వరుస సమావేశాల్లో ఈ విషయంపై తీవ్రంగా చర్చించినట్టు తెలుస్తోంది. సినిమా ప్రకటనలు అన్ని వెబ్సైట్లకూ ఇవ్వకుండా కేవలం కొన్నింటికే పరిమితం చేస్తే..వెబ్ సైట్లలని నియంత్రించే వీలు దక్కుతుందని భావిస్తున్నార్ట. కొన్ని వెబ్ సైట్లతో ఫిల్మ్‌ఛాంబర్ డీల్ కుదుర్చుకుని ఎల్.ఎల్.పీ తరహాలో ఓ పద్ధతి ఏర్పాటు చేసి, కేవలం వాటికే ప్రకటనలు ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. టీవీ ఛానళ్ల నియంత్రణ విషయంలో ఘోరంగా విఫలమైన టాలీవుడ్ పెద్దల ఆలోచనలు… వెబ్ సైట్ల విషయంలో అమలవుతాయన్న గ్యారెంటీ కనిపించడం లేదు. రివ్యూ అనేది వ్యక్తిగత విశ్లేషణ. దాన్ని ఆపడం కచ్చితంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు కళ్లెం వేయాలని చూడడమే. వెబ్ సైట్ల రివ్యూలు పక్కన పెడదాం.. సినిమా చూశాక.. ఫేస్ బుక్‌లోనో, ట్విట్టర్లోనో తన అసంతృప్తిని వీర లెవిల్లో వ్యక్తం చేస్తున్న సగటు సినీ అభిమానుల్ని ఎలా కంట్రోల్ చేస్తారు..? మంచి సినిమా తీస్తే.. కచ్చితంగా అందరూ ఆహా ఓహో అంటారు. తప్పులుంటే.. వాటిని ఎత్తు చూపిస్తారు. ఇది సహజం. దీన్ని సినిమా రూపకర్తలు గుర్తిస్తే మంచిది.