కొద్ది రోజుల క్రితం వరకూ…అంటే పవన్ కల్యాణ్ ట్వీట్లతో టార్గెట్ చేయనంత వరకూ… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తెలుగు మీడియాకు ప్రత్యేక అభిమానం. ఆయన అడుగు తీసి.. అడుగు బయటపెడితే.. లైవ్ వ్యాన్లతో చానళ్లు రెడీగా ఉండేవి. పవన్ ప్రతి అడుగును కవర్ చేసేవి. ఆయన బయటకు వచ్చేదే అరుదు కాబట్టి… కావాల్సినంత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవి. మాట్లాడిన మాటలన్నీ బ్రేకింగ్ న్యూసులు వేసేవి. ఇక ట్వీట్లు పెడితే.. టీవీ చానళ్లు చర్చలు జరిపిన సందర్భాలుకూడా ఉన్నాయి. మీడియా ఫోకస్ వల్లే జనసేన ప్రభావం చూపించే పార్టీగా ప్రజల్లో ఓ అంచనా ఏర్పడింది.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పవన్ కల్యాణ్‌ను మీడియా పూర్తిగా పక్కన పెట్టేసింది. శ్రీరెడ్డి అనే నటీమణి ఇష్యూను పవన్ కల్యాణ్ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారన్నది మీడియా వర్గాల అనుమానం. దాని కోసం మీడియాపై నిందలేసి.. కుల ముద్ర వేసి… పొలిటికల్ స్టాంప్ కూడా వేయాలని చాలా పెద్ద కుట్ర చేశారని మీడియా పెద్దలు ఓ నిర్ణయానికొచ్చారు. అందుకే..మరో మాట లేకుండా పవన్ పై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో పవన్ కల్యాణ్.. టాలీవుడ్ నుంచి… కొన్ని చానళ్లపై బ్యాన్ వేయించేందుకు ప్రయత్నించారు. దీంతో.. మీడియా, పవన్‌కు మధ్య ఉన్న అనుబంధానికి తెరపడినట్లయింది.
ఇప్పుడు పవన్ కల్యాణ్ ట్వీట్ చేసినా.. మాట్లాడినా… బ్రేకింగ్ న్యూసులు రావడం లేదు. టీవీ చానళ్లలో ఆయన పెద్దగా కనిపించడం లేదు. నిజానికి రాజకీయ నిర్ణయాల పరంగా చూస్తే పవన్ కల్యాణ్ అతి పెద్ద నిర్ణయాన్ని రెండు రోజుల కిందట ప్రకటించారు. ఏపీలో 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మామూలుగా అయితే… టీవీ చానళ్లకు ఇది పెద్ద న్యూస్. వెంటనే ఏ పార్టీపై ఎంత ప్రభావం చూపిస్తారంటూ.. విశ్లేషణలు ప్రారంభించేవి. కానీ మీడియతో సున్నం పెట్టుకున్న ప్రభావం స్పష్టంగా కనిపించింది. టీవీ చానళ్లు పవన్ ఇలా అన్నరన్న సమాచారం ఇవ్వడానికే పరిమితమయ్యాయి. చివరికి నెగెటివ్ పబ్లిసిటీ వచ్చే అవకాశం ఉన్న స్ట్రాటజిస్ట్ దేవ్ నియామక వ్యవహారం… రచ్చ అయినా కూడా టీవీ చానళ్లు పట్టించుకోలేదు. దాంతో పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నారన్నది చాలా మందికి తెలియలేదు.
పవన్ స్వతహాగా సినిమా స్టార్ అవడం వల్ల.. ప్రజలు చూస్తారన్న కారణంతో పాటు.. ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉండబట్టే.. గతంలో మీడియా విస్త్రతమైన కవరేజీ వచ్చింది. కానీ అర్థం, పర్థం లేని ట్వీట్లు, కుటుంబసభ్యుల ఫోటోలు పెట్టి మరీ… బెదిరిస్తున్నట్లుగా … ట్వీట్లు చేయడం, మీడియాపై దాడులకు అభిమానులను ప్రొత్సహించడంతో… ఇప్పుడు ఆయనపై ఉన్న సాఫ్ట్ కార్నర్ మీడియాకు లేదు. ఏదో ఓ సాధారణ రాజకీయ పార్టీ నేతగా ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంతే ఇద్దాం కానీ… హైలెట్ చేయాల్సిన అవసరం లేదని మీడియా భావిస్తోంది. నిజానికి పవన్ కల్యాణ్‌తో మీడియాతో ఘర్షణ పడినప్పుడే ఓ వీడియో క్లిప్ బయటకు వచ్చింది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో.. మీడియా లేకపోతే..రాజకీయ నాయకుడు లేడని పవన్ డైలాగ్ చెబుతాడు. ఇప్పుడు అది నిజమేనని పవన్‌కు అర్థమవుతుందని మీడియా ప్రముఖులు చెప్పుకుంటున్నారు.