ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విపక్ష నేత జగన్ కూడా ఈ మధ్య తరచూ అదే విమర్శ చేస్తున్నారు! ఇక, భాజపా కూడా కొత్తగా అదే అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా, భాజపా నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ… వెన్నుపోటు పొడవడం అనేది చంద్రబాబుకి సహజంగా ఉన్న నైపుణ్యమని విమర్శించారు. ఆంధ్రుల ఎంతగానో ఆరాధించే ఎన్టీ రామారావుకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలుసు అన్నారు. ఇప్పుడు అదే విధంగా భాజపాని వెన్నుపోటు పొడిచారనీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆంధ్రాలో చంద్రబాబు కుటుంబ పాలన సాగుతోందన్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ నామరూపాల్లేకుండా పోతుందన్నారు!
ఇక, ప్రతిపక్ష నేత జగన్ చాలా సందర్భాల్లో వెన్నుపోటు గురించే మాట్లాడుతూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరినైనా వెన్నుపోటు పొడుస్తారనీ, బీసీలని వెన్నుపోటు పొడిచారంటూ ఈ మధ్య విమర్శించారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ ఆయనా తరచూ విమర్శిస్తూనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే… ఈ వెన్నుపోటు అనే మాటతోనే భాజపా, వైకాపాలు ముఖ్యమంత్రిపై ఒకేలా దుమ్మెత్తిపోస్తుండటం!
నిజానికి, ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు అనే విమర్శకు రాజకీయ ప్రాధాన్యత లేదనేది ఎప్పుడో తెలిపోయింది. అప్పట్లో ఒక రాజకీయ అత్యవసర పరిస్థితి నెలకొనడం, రాష్ట్ర ప్రయోజనాలతోపాటు తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించడం.. ఆ నేపథ్యంలో టీడీపీ బాధ్యతల్ని చంద్రబాబు తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ నాటి పరిస్థితి నిజంగానే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినదే అయితే… ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేదే కాదు. గత ఎన్నికల్లో కూడా ఈ వెన్నుపోటు వాదనే ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైకాపా ప్రయత్నించింది. కానీ, మళ్లీ టీడీపీకే ప్రజలు పట్టం కట్టారు. కాబట్టి, ఈ వెన్నుపోటు వాదనకు ఎప్పుడూ ఎలాంటి ప్రాధాన్యతా లేదు, ఉండదు. విపక్షాల ఆరోపణ మాత్రమే ఇది. కేవలం ఎన్టీఆర్ పేరును తమకు అనుకూలంగా వాడుకోవడం కోసమే వైకాపా, భాజపాలు ఈ విమర్శను మళ్లీమళ్లీ ప్రజలకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాయి. జగన్ పదేపదే ఇదే మాట అంటున్నా, ఇప్పుడు కొత్తగా భాజపా ఇదే అంశాన్ని విమర్శనాస్త్రంగా మార్చుకున్నా ఎలాంటి ప్రాధాన్యతా ఉండదు.
రాబోయే ఎన్నికల్లో కీలకం కాబోతున్నవి రెండే రెండు అంశాలే… ఒకటీ విభజిత రాష్ట్రం అభివృద్ధి కావాలి, కేంద్రం నిర్లక్ష్యానికి గురౌతున్న ఆంధ్రాకి ధీటైన నాయకత్వం కావాలి. ఆ భరోసా ఎవరి నాయకత్వంలో ఉంటుందని ప్రజలు భావిస్తారో, వారికే అధికారం కట్టబెడతారు.