కర్ణాటకలో తెలుగు ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని ఆ పార్టీ నేతలందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో వీరు మకాం వేశారు. అక్కడి ప్రజల నుంచి బీజేపీ నేతలకు ప్రతిఘటన ఎదురవుతోంది. ఏపీకి అన్యాయం ఎందుకు చేశారన్న ప్రశ్నలు వారికి వస్తున్నాయి. దాంతో తెలుగుదేశం పార్టీ అక్కడి ప్రజలను రెచ్చగొడుతోందని వారు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు.. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు కూడా స్వచ్చందంగా కర్ణాటకు వెళ్లి గ్రూపులుగా మారి.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని ప్రజాసంఘాలు కూడా కర్ణాటకలో మకాం వేశారు. తిరుపతిలో ధర్మపోరాట బహిరంగసభ పెట్టిన చంద్రబాబు… బీజేపీని చిత్తుగా ఓడించాలని కర్ణాటక ప్రజలకు పిలుపునిచ్చారు.
అసలే కర్ణాటకలో కులాలు, మతాల సమీకరణలో వెనుకబడిన భారతీయ జనతా పార్టీకి తెలుగు ప్రజల ఆగ్రహం మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టింది. తెలుగు ఓటర్లను ఏదో విధంగా ప్రధానమంత్రి తన ప్రచారంలో బుజ్జగిస్తారని… కర్ణాటక బీజేపీ వర్గాలు ఇప్పటి వరకూ ఆశతో ఉన్నాయి. ఏపీ సరిహద్దులో ఉన్న బళ్లారిలో ప్రధానమంత్రి బహిరంగసభ ఏర్పాటు చేయడంతో.. అందరి దృష్టి ఆ సభపై పడింది. తెలుగు ప్రజల సెంటెమెంట్ గురించి … ప్రధాని మాట్లాడతారని అందరూ భావించారు. కానీ మోదీ అసలు .. అలాంటి ప్రస్తావనే తేలేదు.
తెలుగు ఓటర్ల సెంటిమెంట్ ను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారపక్షం మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది…. మిగతా రెండు పక్షాల్లో వైసీపీ .. ప్రత్యక్షంగా బీజేపికి ప్రచారం చేస్తోంది. పవన్ కల్యాణ్ జనసేన తటస్థంగా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్ మెంట్లు చేయడం లేదు. పైగా బీజేపీతో కలిశారన్న విమర్శలకు సూటిగా సమాధానం చెప్పకుండా… మద్దతుగా ఉంటున్నట్లుగా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. దాంతో తెలుగు ఓటర్లలో చీలిక ఉంటుందని.. టీడీపీ నేతలు ఏం చెప్పినా.. ఓ వర్గం తమకు మద్దతిస్తుందని బీజేపీ పెద్దలు ఆశ పడుతున్నారు. ఏపీలో రాజకీయ పార్టీల్లో…అధికారపార్టీ మినహా… రెండు పార్టీలు.. ఏపీకి అన్యాయం చేసినప్పటికీ.. బీజేపీకి మద్దతుగా ఉంటున్నాయి. ప్రత్యక్షంగా చెప్పడం లేదు కానీ.. పరోక్షంగా తమ రాజకీయ కార్యకాలాపాలన్నీ టీడీపీని టార్గెట్ చేసి.. బీజేపీని డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల కర్ణాటకలో బీజేపీ పూర్తిగా ఏమీ నష్టపోదని.. సంప్రదాయంగా బీజేపీకి వచ్చే తెలుగు ఓటర్ల మద్దతు తమకు ఉంటుందని నమ్ముతున్నారు. అందుకే తెలుగు ఓటర్ల సెంటిమెంట్ ను గుర్తించనట్లు ఉంటున్నారు.