ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వ్యవహారాలు చూస్తూంటే మాత్రం.. వచ్చే నెలలోనే పోలింగ్ జరగబోతున్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో పార్టీలు దూసుకుపోతూంటే.. నేతలు కూడా.. తమ వ్యక్తిగత రాజకీయాలను ఓ రేంజ్‌లోకి తీసుకెళ్తున్నారు. వలసలతో తెచ్చిపెట్టుకున్న తిప్పలతో కర్నూలు, కడపల్లో వైసీపీ,టీడీపీల్లో సెగలు రేగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండు చోట్ల.. ఒకే పార్టీలో బలమైన ప్రత్యర్థులు పోరాటం చేయడమే దీనికి కారణం.
కడప జిల్లా జమ్మలమడుగు అంటే.. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రం అని అందరికీ తెలుసు. అక్కడ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ప్రధాన ప్రత్యర్థులు. గతంలో ఆదినారాయణరెడ్డి వైసీపీ, రామసుబ్బారెడ్డి టీడీపీలో ఉండేవారు. హోరాహోరీ తలపడేవారు. వీరి మధ్య ఉన్న రాజకీయవైరం మాత్రమే కాదు.. ఫ్యాక్షన్ శత్రుత్వం తరతరాల నుంచీ ఉంది. అయితే … ఆదినారాయణరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీలో చేరిపోయారు. మంత్రి అయ్యారు. ఇప్పుడు కడప జిల్లాల్లో జగన్‌కు చెక్ పెట్టడానికి ఆదినారాయణరెడ్డినే అస్త్రంగా చేసుకుంటోంది టీడీపీ. దానికి ఆయన సిద్ధమైపోయారు. జగన్‌ను నేరుగా ఢీ కొడుతున్నారు. పులివెందులలో కూడా జగన్‌ను ఓడిస్తానని సవాల్ చేస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. తరతరాల శత్రుత్వం ఉన్న ఆదినారాయణరెడ్డి అలా ఆధిపత్యం చూపిస్తూంటే రామసుబ్బారెడ్డి ఎందుకు ఊరుకుంటారు..?. జమ్మలమడుగు టిక్కెట్ వచ్చే ఎన్నికల్లో తనకేనని చెప్పుకోవడం ప్రారంభించారు. ఇది ఆదినారాయణరెడ్డి వరకూ వెళ్లింది. ఆయన ప్రతి విమర్శలు ప్రారంభించారు. దీంతో జమ్మలమడుగులో ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ అక్కడి నేతల్లో ప్రారంభమయింది.
కడప జిల్లా టీడీపీలో ఈ పరిస్థితి ఉంటే.. కర్నూలు జిల్లా వైసీపీలో ఇంచు మించు ఇదే పరిస్థితి ఉంది. పాణ్యం నియోజకవర్గానికి చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డిని జగన్ వైసీపీలో చేర్చుకున్నారు. పాణ్యంలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరిత ఉన్నారు. గౌరు కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. కాటసాని, గౌరు వర్గీయులకు మధ్య ఫ్యాక్షన్ గొడవలున్నాయి. రెండు వర్గాలూ ఒకే ఒరలో ఇమడటం సాధ్యం కాదు. అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి పార్టీలో చేరగానే.. పాణ్యం నుంచి పోటీ చేస్తానని ప్రకటించేశారు. జగన్ తనకు టిక్కెట్ ఇచ్చేశారని చెప్పుకుంటున్నారు. దీంతో గౌరు వర్గీయుల్లో అలజడి ప్రారంభమయింది. టిక్కెట్ విషయంపై జగన్ క్లారిటీ ఇవ్వడం లేదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తాము అండగా ఉన్నామని.. జగన్ తమను అన్యాయం చేయరని గౌరు వర్గీయులు చెబుతున్నారు. కాటసానిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో కర్నూలు వైసీపీలో .. ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ ఆ పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తోంది.
మొత్తానికి అటు టీడీపీకి కానీ.. ఇటు వైసీపీ కానీ… సమస్యలు వచ్చింది వలసల వల్లే. పార్టీ బలోపేతం కోసం అంటూ.. నియోజకవర్గాల్లో అప్పటికే బలమైన నేతలున్నప్పటికీ.. ఇతరుల కోసం… ఆయా పార్టీలు గాలం వేయడంతోనే సమస్యలు వచ్చి పడ్డాయి. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకటి ప్లస్ ఒకటి రెండు కాదు… ఒక్కోసారి సున్నా కూడా అవుతుంది. రెండు పార్టీల్లోనూ ఇప్పుడు అదే అయ్యే చాన్సుందా అన్న అనుమానాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.