తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ పదేళ్లలో ఆయన బయటకు రాకుండా ఉన్న రోజు ఒక్కటి కూడా ఉండదేమో. పార్టీ కార్యక్రమాల కోసమో… ప్రజాసమస్యలపై పోరాటానికో… ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండేవారు. ఏదైనా ఒక్క రోజు చంద్రబాబుకు సంబంధించిన వార్త టీవీల్లో, పేపర్లలో రాకపోతే.. చంద్రబాబు ఈ రోజు కనిపించలేదేమిటబ్బా.. అని ప్రజలు అనుకునే స్థాయిలో ఆయన రోజువారీ రాజకీయాలు ఉండేవి. అలా లేకపోతే…ఇప్పటికే ఫేడవుట్ అయి ఉండేవారేమో. అలాంటి చంద్రబాబు రాజకీయం చేస్తున్న రాష్ట్రంలో.. ఓ రాజకీయ పార్టీగా నిలదొక్కుకోవాలంటే ఆ పార్టీ అధినేత ఏం చేయాలి..? ఇంకెంత కష్టపడాలి..?
తనది సుదీర్ఘ రాజకీయ పయనమని చెబుతున్న పవన్ కల్యాణ్.. ఎక్కువ కాలం.. ఇంటికే పరిమితమవుతున్నారు. ఏపీలో రాజకీయాలు చేస్తున్నా.. ఆయన పట్టుమని.. నెలకు ఐదు రోజులు కూడా.. ఏపీలో గడపడం లేదు. ప్రత్యేకహోదా కోసం విజయవాడలో మూడు కిలోమీటర్ల పాదయాత్ర చేసి.. నెల రోజులు దాటి పోయింది. మళ్లీ ఏపీ మొహం చూడలేదు. పార్టీ కార్యక్రమాల్లో పురోగతి లేదు. సంస్థాగత నిర్మాణం లేదు. రోజులు గడిచిపోతున్నాయి… కొత్త కొత్త వివాదాలు తెచ్చిపెట్టుకుంటున్నారు తప్ప… పనులు ముందుకు సాగడం లేదు. అదే సమయంలో…సినిమా ఫంక్షన్లలో పాల్గొనేందుకు మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు.
పార్టీ పెట్టక ముందు నుంచీ సినిమా ఫంక్షన్లకు పవన్ వెళ్లేవారు కాదు. చివరికి సొంత కుటుంబానికి చెందిన… వారి వేడుకలకూ వెళ్లరు. చిరంజీవి 150వ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఒకే ఒక్క ఆబ్సెంట్ పవన్. అలాంటిది.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత …. రాజకీయ సభల కంటే.. ఎక్కువగా… సినిమా ఫంక్షన్లలో పాల్గొంటున్నారు. కొద్ది రోజుల వ్యవధిలో వరుసగా సినిమా ఫంక్షన్లకు హాజరువుతున్నారు.
అవిశ్వాస రాజకీయాలు వేడి మీద ఉన్నప్పుడే సవాల్ చేసిన పవన్ సైలెంట్‌గా ఉన్నాడని విమర్శలు వస్తున్నప్పుడే.. చల్ మోహన్ రంగ… వేడుకకు హాజర్యయారు. ఆ తర్వాత ప్రత్యేకంగా షో వేయించుకుని.. మీడియాను పిలిపించి మరీ రంగస్థలం సినిమా చూశారు. మళ్లీ… అదే సినిమా విజయోత్సవ వేడుకకూ హాజరయ్యారు. ఇప్పుడు నేల టిక్కెట్ అనే రవితేజ సినిమా వేడుకకూ హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారు.
సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. కానీ సినిమాపై ఆసక్తిని మాత్రం చంపుకోలేకపోతున్నారు. రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి.. ప్రజారాజ్యం విషయంలో జరిగిన తప్పు ..మళ్లీ జరగకుండా చూసుకోవాల్సింది పోయి… టేకిట్ ఈజీ మైండ్ సెట్‌తో నాన్ సీరియస్ పొలిటిషియన్‌గా ప్రొజెక్ట్ అవుతున్నారు.