తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. రాజకీయంగా అంత తేలిగ్గా ఓటమి అంగీకరించారు. గెలిచే వరకూ ప్రత్యర్థిపై స్ట్రైక్ చేస్తూనే ఉంటారు. ఆయన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఓట్ల పరంగా.. సీట్ల పరంగా ఓడిపోయి ఉండవచ్చు కానీ.. ప్రయత్నాల పరంగా మాత్రం ఆయన ఎప్పుడూ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం విషయంలోనూ.. ఆయన ప్రయత్నాలను మానలేదు. వచ్చే ఎన్నికల విషయంలో.. తెలంగాణకు సంబంధించినంత వరకూ బ్లూప్రింట్ రెడీ చేసుకున్నట్లు.. టీటీడీపీ నేతల మీటింగ్‌లో పరోక్షంగా ప్రకటించేశారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసేశానన్నారు. దాంతో అవాక్కవడం తెలంగాణ నేతల వంతయింది.
కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇరవై స్థానాల్లో విజయం సాధించారు. ఇందులో పదిహేను తెలుగుదేశం పార్టీవే. కానీ ఇప్పుడు ఎంత మంది ఉన్నారు. ఇద్దరంటే ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు ఆర్.కృష్ణయ్య. ఎన్నికలు దగ్గరకొస్తూండటంతో.. ఆయన సొంత పార్టీ పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. అంటే… ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. ఆయనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీని అంటి పెట్టుకునే ఉన్నారు. పార్టీని వీడిపోయేవాళ్లను చంద్రబాబు ఎప్పుడూ ఆపలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి వంటి వారిని దూరం పెట్టారు కానీ… బుజ్జగించే ప్రయత్నం చేయలేదు.
కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎంత మంతి నేతలు వెళ్లిపోయినా..స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. ఏ పార్టీ వాళ్లు కూడా కాదనలేని సత్యం ఇంది. మల్కాజ్ గిరి, ఖమ్మం లోక్ సభ సీట్లలో టీడీపీ గెలుస్తుందని.. ఇటీవల కొన్ని సర్వేల్లో వెల్లడయిందన్న ప్రచారం.. కొన్ని పార్టీల నేతలకు షాక్ ఇచ్చింది. కానీ వారు కూడా.. అసాధ్యమని తీసి పారేయలేని పరిస్థితి. అలాగే పాతబస్తీ మినహా గ్రేటర్లో ఉన్న నియోజకవర్గాల్లో… ఏ పార్టీ అయినా తెలుగుదేశంతోనే పోటీ పడాల్సి ఉంటుంది. ఇక సంప్రదాయక ఓటు బ్యాంక్ ఉన్నా.. బలమైన నేత లేక… నిద్రాణంగా అనేక చోట్ల క్యాడర్ ఉంది. వీరికి ఉత్సాహం ఇచ్చేందుకు చంద్రబాబు.. అన్ని స్థాయిల్లోనూ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు… తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు స్పష్టమైన సూచనలు చేశారు.
పార్టీ ఒంటరిగా బరిలోకి దిగే కన్నా.. పొత్తుల ద్వారానే అయితే… పార్టీని నమ్ముకున్న వారికి ఉపయోగం ఉంటుందని చంద్రబాబు కూడా నమ్ముతున్నారు. అందుకే బలంగా ఉంటేనే పొత్తులు పెట్టుకునేందుకు ఎవరైనా వస్తారని చెబుతున్నారు. అయితే ఇప్పటికే.. పొత్తుల విషయంలో చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో… దీన్ని బయటపెట్టే అవకాశం ఉంది. చంద్రబాబు రాజకీయం… ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరిపోవాలన్నట్లుగా ఉండదు. స్టెప్ బై స్టెప్ ఎక్కితేనే స్ట్రాంగ్‌గా ఉంటామనుకుంటున్నారు. అందుకనే.. ముందు కొన్నిసీట్లు సాధించి ఉనికి కాపాడుకుంటే.. ఆ తర్వాత ఉనికి చాటుకోచ్చని ప్లాన్ వేస్తున్నారు. అదే క్యాడర్‌కూ ఉపదేశిస్తున్నారు.