కర్ణాటక ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పటికే ఓసారి గుళ్లూ గోపురాలూ తిరిగేశారు. మతం పేరుతో ఆకర్షిద్దామని అనుకున్నారు. కానీ, ఆ పాచిక పారేట్టు లేదని వారికీ అర్థమైపోయింది. దాంతో కర్ణాటకలో శాంతిభద్రలకు విఘాతం కలిగించేలా కాంగ్రెస్ పాలన ఉందనే వాదన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే, భాజపా పాలిత రాష్ట్రాల్లో బాలికలపై లైగింక దాడులు, ఆందోళనల వల్ల ఆ ప్రయత్నమూ ఫలించలేదు. ఆ తరువాత, కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ వెర్సెస్ మోడీ అన్నట్టుగా మార్చాలని ప్రయత్నించారు. అలా అయితే, ప్రచారంలో కాంగ్రెస్ వెనకబడుతుందనీ భావించారు. తమ వాక్చాతుర్యంతో రాహుల్ ని కంగారుపెట్టెయ్యొచ్చు అనుకున్నారు. కానీ, ఆ ఛాన్స్ ఇవ్వకుండా మోడీని నేరుగా సిద్ధరామయ్యే ఢీ కొడుతున్నారు. సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.
తాజాగా దళిత ప్రేమను కురిపించే ప్రయత్నం భాజపా చేసింది! కర్ణాటకలోని దళిత వాడలకు వెళ్లి, వాళ్లతో మమేకమౌతూ సహపంక్తి భోజనాలు చేయండి అంటూ నేతల్ని భాజపా అధినాయకత్వం ఆదేశించింది. అమిత్ షా కూడా కొన్ని చోట్ల భోజనాలకు వెళ్లి, ట్విట్టర్ లో ఫొటోలు పెట్టారు. అయితే, ఈ కార్యక్రమంపై ఆర్.ఎస్.ఎస్. మండిపడటం గమనించాల్సిన విషయం! దళితుల్లో సరిగా కలవలేకపోతున్నారనీ, ఫొటోలకు ఫోజులు ఇచ్చినంత మాత్రన సరిపోదనీ, వారిలో నిజమైన నమ్మకాన్ని కల్పించేందుకు ఇవి చాలవనంటూ మోహన్ భగవత్ సీరియస్ అయ్యారు. ఎందుకంటే, ఆర్.ఎస్.ఎస్. చేయించిన సర్వేలో కర్ణాటకలో దళితులెవ్వరూ భాజపాకి అనుకూలంగా లేరని తేలిందట. దాంతో ఆయన అలా ఆవేదన వ్యక్తం చేశారు.
భాజపా దళిత వ్యతిరేకి అనే వాదనను వినిపించేందుకు కాంగ్రెస్ బలమైన ప్రచారం చేస్తోంది. మల్లిఖార్జున ఖర్గే దళితుడు, కర్ణాటక పీసీసీ ఛీప్ కూడా దళితుడే. కర్ణాటకలో భాజపా సీఎం అభ్యర్థిగా ఎడ్యూరప్పకు బదులుగా దళితుడిని ప్రకటించగలరా అంటూ ఈ ఇద్దరూ మోడీకి తాజాగా సవాల్ చేశారు. పార్లమెంటులో ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు కావడం వల్లనే, ఢిల్లీలో తమను చులకనగా చూస్తున్నారంటూ ఖర్గే ఆరోపించారు. దీంతో భాజపాకి దళితులు ఓటేసే పరిస్థితి లేదనే భావన ఏర్పడుతోంది. కర్ణాటకలో భాజపా ప్రచారంపై ఆర్.ఎస్.ఎస్. మండిపడటం విశేషం. మొత్తానికి, కర్ణాటకలో భాజపా చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలూ ఒక్కోటిగా ఫలించడం లేని పరిస్థితి కనిపిస్తోంది. మరీ, మోడీ షా ద్వయం ఎలాంటి కొత్త వ్యూహాలను తెర మీదికి తెస్తారో చూడాలి.