గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన దారుణం తెలిసిందే. తొమ్మిదేళ్ల బాలికపై సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారం చేయడం… అందర్నీ కలచివేసిన ఘటన. అనంతరం నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఈ ఘటన నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు అనుసరించిన వైఖరి చూస్తే… రాజకీయాలు ఇంత దారుణంగా దిగజారిపోయాయా అనిపిస్తుంది. తెల్లారి లేచింది మొదలు ఏదో ఒక అంశం అడ్డుపెట్టుకుని ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకు పోసుకుంటూ ఉంటారుగా. ఇది చాలదేమో అన్నట్టుగా తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగితే… ఇలాంటి హృదయవిదారకమైన ఘటనలో కూడా రాజకీయ కోణాలు వెతుక్కుని బురదజల్లుకునే కార్యక్రమాలకు దిగడం దారుణం.
అధికార పార్టీ టీడీపీకి చెందినవాడే ఈ సుబ్బయ్య అనీ, ప్రభుత్వం ఆయన కుటుంబానికి ఇల్లిచ్చిందనీ, ఇతర పథకాలు అందిస్తోందంటూ సాక్ష్యాధారాల ప్రదర్శనకు వైకాపా దిగింది. సుబ్బయ్య క్రియాశీల టీడీపీ కార్యకర్త అని వైకాపా బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి చెప్పారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఆయనకి ఇల్లు ఇచ్చారంటూ చెప్పారు. ఇక, ఎమ్మెల్యే రోజా సంగతి అయితే సరేసరి! బాధితురాలిని పరామర్శించి, ఆసుపత్రి నుంచి వచ్చాక ఆమె మాట్లాడిన తీరు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నవారంతా తెలుగుదేశం పార్టీకి చెందినవారే అని ఆమె ఆరోపించారు. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే… అత్యాచార ఘటనపై స్పందించేందుకు వచ్చిన రోజా, ఈ కార్యక్రమం ముగించుకుని జబర్దస్ట్ షూటింగ్ కి వెంటనే వెళ్లిపోయారని కొంతమంది అంటున్నారు! ఇక, టీడీపీ నేతలు కూడా సుబ్బయ్య కుటుంబానికి వైకాపాతో సంబంధాలున్నాయని నిరూపించే ప్రయత్నమే చేశారు. వారి బంధువులు ఆ పార్టీలోనే ఉన్నారంటూ, జగన్ కి మద్దతుగా ఫ్లెక్సీలు పెట్టారంటూ టీడీపీ నేతలు కూడా ప్రత్యారోపణలు చేశారు.
దాచేపల్లి ఘటనపై నాయకులు స్పందించిన తీరు చూస్తుంటే… ఇలాంటి సందర్భాల్లో కూడా రాజకీయాలు చేస్తున్న వీళ్లా మన నాయకులు అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి! ఇంతకంటే దిగజారేందుకు ఇంకా ఏముంది అనిపిస్తుంది. అత్యాచారం లాంటి ఘటనలపై మానవతా దృక్పథంతో స్పందించాలి. వీలైతే బాధితులకు ఓదార్పుగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టపరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో మాట్లాడుకోవాలి. అంతేగానీ… ఇలా దిగజారుడు రాజకీయాలకు పోతుంటే.. వీళ్లా ప్రజలకు మంచి చేసే నాయకులు అనే ప్రశ్న మొదలౌతుంది. వీళ్లా రేప్పొద్దున మనల్ని పాలించేవారనే జుగుప్స కలుగుతుంది.