రాజకీయాల్లో అడుగులు తడబడితే.. సమర్థించుకునే నైపుణ్యం ఉండాలి. మొండిగా వాదించుకునే ధైర్యం ఉండాలి..! లేకపోతే తప్పయిపోయింది..కరెక్ట్ చేసుకుంటున్నా ..! అని కార్యకర్తలకు సందేశం ఇవ్వాలి. ఇవేమీ లేకుండా… మౌనంగా ఉన్నారంటే… ఏదో గూడుపుఠాణి ఉన్న అనుమానం.. ప్రజల్లో వస్తుంది. ఎంత ఆలస్యమైతే..అంతగా నెగెటివ్ ప్రచారం జరుగిపోతోంది. జనసేనకు ఇప్పుడు అదే పరిస్థితి ఎదురయింది. దేవ్ అలియాస్ వాసుదేవ్ అనే వ్యక్తిని పవన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా నియమించుకోవడంతో ప్రారంభమైన వివాదం ఆ పార్టీని చుట్టుముట్టేసింది. ఏపీపై… బీజేపీ పన్నుతున్న కుట్రను జనసేన ద్వారా అమలు చేయడానికే… దేవ్ వచ్చాడని.. అందుకే తన ఐడెంటిటీని గోప్యంగా ఉంచాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే దేవ్ పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటపడటంతో… జనసేన పార్టీలో చిన్నపాటి కుదుపు వచ్చింది.
ఈ విషయంపై పవన్ కల్యాణ్ ఇంత వరకూ స్పందించలేదు. తాజా వివాదంపై పవన్ కల్యాణ్ స్పందనేమిటో… ఆయన సన్నిహిత వర్గాలకూ తెలియడం లేదన్న ప్రచారం ఉంది. అయితే వాసుదేవ్ విషయంలో..అటు సామాన్యుల్ోలనూ.. ఇటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పవన్ కల్యాణ్‌కు పూర్తి అవగాహన ఉందంటున్నారు. అయితే పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. దేవ్‌ను సమర్థిస్తున్నారా..? ఆయన నియామకాన్ని కొనసాగిస్తున్నారా..? అన్నీ తెలిసే స్ట్రాటజిస్ట్‌గా పెట్టుకున్నారా..? ఈ అంశాలపై కనీసం పార్టీ కార్యకర్తలకైనా పవన్ కల్యాణ్ సందేశం ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే పవన్ కల్యాణ్‌కు దేవ్ విషయంలో ఏం చేసినా చిక్కులు తప్పవు. అన్నీ తెలిసే పెట్టుకున్నానంటే.. బీజేపీతో కుమ్మక్కయ్యారనడానికి ఇంత కన్నా సాక్ష్యం లేదంటారు. తనను దేవ్ మోసం చేశారంటే.. ఆయనను తప్పించాల్సి వస్తుంది. ఇలా చేస్తే ఓ స్ట్రాటజిస్ట్ బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోలేని వ్యక్తికి రాజకీయాలు చేసే అర్హత ఉందా అన్న విమర్శలు వస్తాయి. ఏమీ మాట్లాడకపోయినా… బీజేపీ చేతులో కీలబొమ్మ అయ్యారు కాబట్టే.. వారేమీ చెబితే అదే మాట్లాడతారు.. అప్పటి వరకూ సైలెంట్‌గా ఉంటారు అన్న విమర్శలొస్తాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏం చేసినా.. విమర్శలు వస్తాయి,. ధైర్యంగా తిప్పికొట్టే .. గడుసుదనం ఉండాలి. సైలెంట్‌గా ఉంటే… చేతకాదనుకుంటారు.
రెండు రోజుల వరకు.. దేవ్ విషయంలో సైలెంట్ గా ఉన్న జనసేన వర్గాలు.. నిన్నటి నుంచి… ఆయన అర్హతలు ఫేక్ కాదంటూ… సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించాయి. ఆయన బ్రిటన్ పార్టీలకూ సేవలందించారని చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ అధికారికం అయితే.. దేవ్ విషయంలో ఇంత వివాదం జరిగినా పవన్ .. సానుకూలంగా ఉన్నట్లే భావించాలి. అందుకే పవన్ కల్యాణ్ దేవ్ విషయంలో మౌనం వీడాలని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు.