తెలుగు ప్రేక్షకులు తమ హృదయాల్లో ‘మహానటి’ స్థానాన్ని చోటిచ్చింది ఒక్క సావిత్రికి మాత్రమే. అందులో ఎవరికీ ఎటువంటి సందేహాలూ లేవు. సావిత్రి మహానటి మాత్రమే కాదు… మహామనిషి కూడా. ఆవిడ చేసిన దానధర్మాలు, సహాయాల గురించి ఇప్పటికీ ఎంతోమంది సినిమా ప్రముఖులు కథలు కథలుగా చెబుతుంటారు. సావిత్రి వ్యక్తిత్వం గురించి మరింత లోతుగా తెలిస్తే.. మహామనిషి కంటే ఎక్కువని చెప్పాల్సిందే. నటిగా ఎంత బిజీగా వున్నప్పటికీ… అమ్మ ఫ్యామిలీకి టైమ్ కేటాయించేదని సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి తెలిపారు. ఓ తల్లిగా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడంతో పాటు స్నేహితురాలిలా తమతో కలిసి చిలిపి పనులు చేసేదని ఆమె పేర్కొన్నారు. “చెట్లు ఎక్కడం.. చింతకాయలు, మామిడి కాయలు కోయడం.. కోతికొమ్మచ్చి ఆటలు ఆడటం.. వానలో తడవడం… ఇలా మాతో కలిసి అమ్మ ఎన్నో చిలిపిపనులు చేసేది. ఎంత అలసటగా వున్నా సంతోషంగా గడిపేది” అని విజయ చాముండేశ్వరి తెలిపారు. ప్రతి తల్లి చేసే పనులే ఇవి. అయితే… నటిగా ఎంత బిజీగా వున్నప్పటికీ తల్లిగా చేయడం గ్రేటే. ఇక, సావిత్రిని మహామనిషిని చేసే సంఘటన ఏంటంటే… తమ దగ్గర పని చేసే వ్యక్తులను గౌరవించడం. పనివాళ్లను ఆమె మాత్రమే గౌరవించడం కాదు… పిల్లలు గౌరవించకపోయినా ఒప్పుకొనేవారు కాదట. పనివాళ్లనూ పిల్లలతో, ఫ్యామిలీతో కలిసి భోజనం చేయమని ఆహ్వానించేవారట. ఎంతమందికి అంత మంచి హృదయం వుంటుంది చెప్పండి. అందుకనే ఆవిడను మహానటితో పాటు మహామనిషి అనేది. దటీజ్ సావిత్రి. ఇటువంటి ఎన్నో విశేషాలతో రూపొందిన సినిమాయే ‘మహానటి’. సావిత్రి జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.