దాచేపల్లి ఘటనపై వైకాపా ఇంకా తగ్గడం లేదు. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ్ల దాచేపల్లి వెళ్లారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించారు. లైంగిక దాడికి గురైన బాలిక భవిష్యత్తుకు భరోసా కల్పించారు. ఆమెను తాను చదివిస్తాననీ, వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటున్నానని సీఎం ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పారు.
ఇక, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ వైఫల్యాలన్నీ వైకాపా మీద వేస్తున్నారంటూ విమర్శించారు. సుబ్బయ్య తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తేననీ, సభ్యత్వ ధ్రువపత్రం తమకు లభించినా ఈ విషయాన్ని రాజకీయం చేయకూడదన్న ఒకే ఒక్క కారణంతో దీన్ని (పత్రాన్ని చూపిస్తూ) బయటపెట్టలేదన్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే తాము పోరాటం చేశామన్నారు. తమ పోరాటం కారణంగానే ముఖ్యమంత్రి స్పందించారనీ, దాచేపల్లి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారని ఆమె చెప్పారు. వైకాపా పోరాడబట్టే ఈరోజున ఆ కుటుంబానికి ఎంతోకొంత సాయం చేయాలన్న బుద్ధి అధికార పార్టీకి పుట్టిందన్నారు. తాము నిలదీయ్యబట్టే ఆ బాలిక మంచి చెడ్డలు చూసుకుంటానంటూ ముఖ్యమంత్రి ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అంతేతప్ప, ఆ కుటుంబంపై ప్రేమతో చంద్రబాబు రాలేదని అందరికీ తెలుసు అన్నారు. ఈ రాష్ట్రంలో ఆడవాళ్లు బయటకి రావాలంటే భయపడే పరిస్థితి ఈ పాలనలో ఉందని మండిపడ్డారు. టీడీపీ నేతలు చింతమనేని, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, పయ్యావు కేశవ్ లు ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ ఇష్యూని వైకాపా ఇక్కడితో వదలేట్టు లేదు. ముఖ్యమంత్రి స్పందించి, ఆ కుటుంబాన్ని పరామర్శించి పరిహారం ప్రకటిస్తే.. అది తమ పోరాట ఫలితమే అని రోజా చెప్పడం విడ్డూరం! రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతుంటే… ఇక్కడికి మాత్రమే ఎందుకొచ్చారనీ, మిగతావారి కుటుంబాలకు ఎందుకు భరోసా ఇవ్వడం లేదని ముఖ్యమంత్రిని రోజా ప్రశ్నించారు. తాము పోరాటం చేశాం కాబట్టే వచ్చారన్నట్టు చెప్పుకొచ్చారు. సరే, రోజా చెబుతున్నట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా అంత తీవ్రంగా పరిస్థితి ఉంటే, బాధితులంతా టీడీపీ వాళ్లైతే, వైకాపా నేతలు పోరాడటం వల్లనే ఆయా కుటుంబాలకు న్యాయం జరుగుతుందనీ, ప్రభుత్వం స్పందించి సాయం చేస్తుందనీ, ముఖ్యమంత్రి దిగొస్తారనీ తెలిస్తే… అందరి తరఫునా వీళ్లెందుకు పోరాటం చేయడం లేదు..? అంటే, సుబ్బయ్య టీడీపీ సభ్యత్వం పొందినట్టు ధ్రువీకరణ పత్రం లభించింది కాబట్టే రోజా ఇంత తీవ్రంగా పోరాడుతున్నారని అర్థం చేసుకోవాలా..? దాచేపల్లి ఘటన నేపథ్యంలో రాజకీయ పార్టీలు స్పందిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. దాన్ని అసహ్యించుకునే స్థాయికి తీసుకెళ్లే వరకూ వీళ్లు ఆగేట్టు లేరు..!