వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ సారి.. సకుటుంబ సపరివార సమేతంగా ఎన్నికల సమరంలో పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవర్నీ నిర్లక్ష్యం చేయలేని పరిస్థితుల్లో జగన్ పడిపోయారు. ఒక్క కడప జిల్లా నుంచే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ప్రకాశం, అనంతపురం లాంటి జిల్లాల్లోనూ కుటుంబసభ్యులను నిలబెట్టబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి టిక్కెట్లు ఆశిస్తున్న వారంతా.. ఇప్పటికే జగన్పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని.. ఎవరినీ కాదలేని పరిస్థితుల్లో జగన్ ఇరుక్కుపోయారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా జగన్ పోటీ చేయడం ఖాయమే. ఇప్పటికే కమలాపురం ఎమ్మెల్యేగా జగన్ మేనమాన రవీంధ్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఈ సారి కూడా ఆయనకు టిక్కెట్ నిరాకరించే పరిస్థితి లేదు. కాకపోతే.. ఆయన కడప సిటీ మీద కన్నేశారు. కడప లోక్సభ సభ్యుడు అవినాష్ రెడ్డిని ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. కమలాపురం సీటను ఆయనకు కేటాయించడం ఖాయమే. అవినాష్ రెడ్డికి టిక్కెట్ నిరాకరిస్తే.. కుటుంబంలో చీలక వచ్చే ప్రమాదం ఉంది. రాయచోటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హ్యాండ్ ఇవ్వడం దాదాపు ఖాయమే. అక్కడ ద్వారకనాథ్ రెడ్డి అనే బంధువు ఇప్పటికే కర్చీఫ్ వేసేశారని ప్రచారం జరుగుతోంది. రాజంపేట – వైఎస్ వివేకానందరెడ్డి, జమ్మలమడుగు – విజయమ్మ , మైదుకూరు – వై.ఎస్.వినీత్ రెడ్డి , ప్రొద్దుటూరు – వైఎస్ మనోహర్ రెడ్డి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఒకే జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలు బంధువులకే ఇస్తే విమర్శలొస్తాయన్న ఉద్దేశంతో ఒకరిద్దరికి వేరే జిల్లాల్లో సర్దుబాటు చేయాలనుకుంటున్నారట. వైఎస్ వివేకానందరెడ్డిని… అనంతపురం జిల్లా రాయదుర్గంకు పంపించాలని సర్వేలు చేయిస్తున్నారు. మరో ఒకరిద్దర్నీ కూడా ఏదో విధంగా బుజ్జగించేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జమ్మలమడుగులో ఆదినారాయణను ఢీకొట్టాలంటే విజయమ్మే కరెక్టని జగన్ డిసైడయ్యారు. ఇంకా విశేషం ఏమిటంటే… జగన్ భార్య భారతి కూడా..ఇటీవలి కాలంలో రాజకీయంగా సందడి చేస్తున్నారు. ఆమె పోటీ కూడా ఖాయమంటున్నారు.
ఒక్క కడప జిల్లాలోనే కాదు.. ఉత్తరాంధ్రలోనూ… జగన్ కుటుంబసభ్యులు ఒకరు పోటీలో నిలబడటం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ పార్లమెంట్ సీటును గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే ఉద్దేశంతో… షర్మిలను పోటీ పెట్టాలని ఆలోచిస్తున్నారు. కానీ ఆమె ఆసక్తి చూపడం లేదట. అదే సమయంలో.. ఒంగోలు పార్లమెంట్ సీటుకు కూడా ఆమె పేరును పరిశీలిస్తున్నారు. పార్లమెంట్ టిక్కెట్ ఇవ్వకపోతే… వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాలో అసెంబ్లీ టిక్కెట్ కేటాయించాల్సింది. ఇప్పటికే మరో దగ్గరి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక సీటు ఖాయమే. గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. ఈ సారి మార్కాపురం పై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వీరే కాదు.. బంధువు వర్గం నుంచి మరికొంత మంది కూడా.. ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా లేదన్నా.. ఈ సారి జగన్… మొత్తం ఫ్యామిలీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.