బహుశా… మూడేళ్ల క్రితం అనుకుంట! మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ ఓ సినిమా ప్రకటించాడు. అదీ దేశభక్తి నేపథ్యంలో! సినిమా పేరు ‘జనగణమన’. అప్పటికి మహేష్, పూరి కాంబినేషన్లో ‘పోకిరి’, ‘బిజినెస్ మెన్’ సినిమాలు వచ్చాయి. రెండూ హిట్టే. దాంతో మూడో సినిమాపై క్రేజ్ ఏర్పడింది. హ్యాట్రిక్ కొడతారని అందరూ ఎదురు చూశారు. దానికి తోడు ‘జనగణమన’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనీ, సమాజంలో ప్రజల పోకడ చూసి విసుగు, కోపంతో కథ రాశననీ పూరి చెప్పడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఇంకా ఇంకా పెరిగాయి. కారణాలు తెలియదు కానీ… సినిమా పట్టాలు ఎక్కలేదు. కథ స్టేజి నుంచి సినిమా ముందుకు కదల్లేదు. తరవాత పూరి ఫ్లాపుల్లో పడ్డాడు. అందరూ ఆ సినిమా గురించి మర్చిపోయారు. కానీ, పూరి మాత్రం ఎప్పటికి అయినా ఆ సినిమా తీస్తానని చెబుతున్నారు. “నిర్భయ, అసిఫా ఘటనలు జరిగినప్పుడు దేశంలో ప్రజలు అందరిలా నేనూ మధనపడతా. వేరే దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే తలలు తీసేస్తారు. మన దేశంలో అలాంటి చట్టాలు లేవు. ఇక్కడ ఎవరికి భయం లేకుండా పోయింది. ఆ ఆవేదన లోంచి పుట్టిన కథే ‘జనగణమన’. నేను భారతదేశం ఎలా ఉండాలని అనుకుంటున్నానో… చూడాలని అనుకుంటున్నానో.. ఆ సినిమాలో చూపిస్తా. ఎప్పటికైనా ఆ సినిమా తీస్తా” అన్నారు పూరి జగన్నాథ్. ముందుగా అనుకున్నట్టు మహేష్ బాబు హీరోగా ఆ సినిమా తీస్తారా? మరో హీరోతో తీస్తారా? అనేది చూడాలి. ఎవరితో తీసినా పూరి మార్క్ డైలాగులు సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ హీరోతో తీసినా ఆ హీరో ఇమేజ్, స్టైల్ కి తగ్గట్టు సినిమా తీయగల సమర్ధుడు పూరి. రెండు హిట్స్ పడితే అతనితో సినిమా చేయడానికి చాలామంది హీరోలు ముందుకు వస్తారు. ఇప్పుడు కూడా హీరోలు రెడీ అనుకోండి.. హిట్స్ పడితే ఆ క్రేజ్ వేరు కదా!!