హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో వైస్ ఛాన్సలర్ అప్పారావు ఇప్పుడు కేంద్రబిందువుగా మారిన సంగతి తెలిసిందే. అప్పారావు గతాన్ని పరిశీలిస్తే అయ్యగారి గతం ఘనంగానే ఉంది. లాబీయింగ్‌లో, నెట్వర్కింగ్లో సార్‌ది అందెవేసిన చేయి అని, ఎందరో రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయని చెబుతున్నారు. 35 మంది అభ్యర్థులను ఒకేసారి దాటేసి వీసీ పోస్ట్ దక్కించుకున్నారంటేనే ఆయన సమర్థత ఎంతో అర్థం చేసుకోవచ్చు. 2001 నుంచి 2004 వరకు హెచ్‌సీయూలో ఛీఫ్ వార్డెన్‌గా పనిచేసిన అప్పారావు 11 సంవత్సరాలలో వీసీ పోస్ట్ వరకూ ఎదిగిపోయారు. అప్పారావుది పూర్తిగా రాజకీయ నియామకమనటంలో ఎలాంటి సందేహమూ లేదని అంటున్నారు. తెలుగుదేశంలోని ఒక కీలక లాబీయిస్ట్ నాయకుడికి బంధువైన అప్పారావు వెంకయ్య నాయుడును పట్టుకుని ఈ పోస్ట్ కొట్టేశారని చెబుతున్నారు. వెంకయ్య నాయుడు అప్పారావు పేరును స్మృతి ఇరానికి సిఫార్స్ చేయటం వలనే ఆయనకు వీసీ పోస్ట్ దక్కిందనే విషయం యూనివర్సిటీలో అందరికీ తెలిసిందేనని అంటున్నారు. అందుకనే ఈయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. 2002లో ఛీఫ్ వార్డెన్‌గా ఉన్నపుడు 12 మంది దళిత విద్యార్థులను హాస్టల్నుంచి బయటకు పంపేశారని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆరోపణ. అయితే అప్పారావు మాత్రం తాను ఏ పార్టీకీ చెందని వాడినని, యూనివర్సిటీని బాగుచేయటానికి తనకు ఎంతో పెద్ద ప్రణాళిక ఉందని, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు.