ప్రేక్షకులు మెచ్చే సినిమా తీయడం ఎంత ముఖ్యమో… సినిమా కథ ఏమిటనేది ప్రేక్షకులకు తెలిసేలా పబ్లిసిటీ చేయడం కూడా అంతే ముఖ్యం. కథకు తగ్గట్టు టీజర్, ట్రైలర్స్ కట్ చేయాలి. లేదంటే అసలుకే మోసం వస్తుంది. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ విషయంలో అదే జరిగిందని చాలామంది ప్రేక్షకులు, విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు… ‘భరత్ అనే నేను’ సినిమాని తీసుకోండి. రాజకీయ నేపథ్యంలో రూపొందిన సినిమా. అందుకు తగ్గట్టుగా ‘ఫస్ట్ ఒత్’ అంటూ ముందు ప్రమాణ స్వీకారం ఆడియోని విడుదల చేశారు. తరవాత ప్రీ రిలీస్ వేడుకను ‘భరత్ బహిరంగ సభ’ అంటూ నిర్వహించారు. పబ్లిసిటీ అంతా పొలిటికల్ యాంగిల్ లో చేశారు. దాంతో ప్రేక్షకులు సినిమాపై ముందుగా ఓ ఐడియాకి వచ్చారు. సినిమాలో వారు ఊహించినది ఉండటంతో ఎలాంటి డిజప్పాయింట్స్ లేవు. హ్యాపీగా చూశారు.
‘నా పేరు సూర్య’ విషయానికి వస్తే.. ఇటువంటి ముందుచూపు కొరవడిందనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. సినిమాలో తండ్రీకొడుకుల బంధం, ఇద్దరి మధ్య సంబంధం ముఖ్య భూమిక పోషించింది. కథలో అదే కీ పాయింట్. కానీ, టీజర్.. ట్రైలర్.. ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఆ టాపిక్ గురించి చెప్పలేదు. పైపెచ్చు… అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా టీజర్, ట్రైలర్ కట్ చేశారు. రెండిటిలోనూ అల్లు అర్జున్ పాత్రలోని కోపమే చూపించారు. దానికి తోడు ఫాస్ట్ బేస్డ్ ఫైట్ కట్స్ ఒకటి. సినిమా అంతా అదే విధంగా వుంటుందని ఊహించి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు షాక్ తగిలింది. అదే సినిమాలో కంటెంట్ కి తగ్గట్టు టీజర్, ట్రైలర్ కట్ చేస్తే మిక్స్డ్ టాక్ వచ్చేది కాదని, రెండో రోజుకి కలెక్షన్స్ డ్రాప్ అయ్యేవి కాదని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు అల్లు అర్జున్ పాత్రకు మంచి పేరొచ్చింది. పబ్లిసిటీలో ఫాదర్ అండ్ సన్ రిలేషన్, కోపాన్ని కంట్రోల్ చేసుకుకోవడానికి హీరో పడే స్ట్రగుల్ చూపిస్తే సినిమాకి మంచి పేరు వచ్చేదెమో!!