నటన (రీల్ లైఫ్)… జీవితం (రియల్ లైఫ్)… రెండిటినీ ఒక్కటి చేసి చూడటం ఎంతో కష్టమైన పని. నటనకు ఏ పాత్ర అయితే ఏంటి? దర్శకుడు చెప్పినట్టు చేయడమేనని చాలామంది అనుకుంటారు. అందులోనూ తెరపై ప్రేక్షకులకు కనిపించని బోల్డంత కష్టం దాగుంటుంది. జీవితం విషయానికి వచ్చేసరికి తెరపై చేసిన పాత్ర చేయడానికి చాలా సందర్భాల్లో కుదరదు. కొన్నిసార్లు కుదురుతుంది. అల్లు అర్జున్‌కి అలా కుదిరింది. తాజాగా విడుదలైన ‘నా పేరు సూర్య’ సినిమాలో ఆయన ఆర్మీలో సైనికుడిగా కనిపించారు. షూటింగులో భాగంగా కొన్ని సన్నివేశాలను రియల్ లొకేషన్స్, ఆర్మీ మధ్య తీశారు. అప్పుడు ఆర్మీలో సభ్యుడు కావాలని నిర్ణయించుకున్న అల్లు అర్జున్, అందుకు అవసరమైన పేపర్స్ సబ్‌మిట్ చేయడం కూడా జరిగింది. అయితే… అల్లు అర్జున్ సినిమాలు వదిలేసి ఆర్మీలోకి వెళ్లడం లేదు. అందులో గౌరవ సభ్యుడిగా చేరేందుకు ఆసక్తి చూపించారు. ఆర్మీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాని ఆదివారం రాత్రి ఆర్మీ అధికారులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమా చూసిన ఒక అధికారి బన్నీని ఆర్మీలో చేరమని కోరగా… అందుకు అవసరమైన పత్రాలను ఎప్పుడో సబ్‌మిట్ చేశానని తెలిపారు. నిజానికి ఈ విషయాన్ని ఆర్మీ ప్రొసీజర్ పూర్తయిన తరవాత చెప్పాలని అనుకున్నార్ట. షో చూసిన అధికారులు అడిగేసరికి చెప్పేశారు. చట్టపరమైన చర్యలు పూర్తయితే జీవితాంతం గర్వపడతానని అల్లు అర్జున్ తెలిపారు.