తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై ఇప్పటికే రాజకీయ పార్టీల్లో ఉండాల్సింత వ్యతిరేకత ఉంది! తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆయన పనితీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తోంది. ఆంధ్రాలో కూడా టీడీపీ నేతలు కూడా వివిధ సందర్భాల్లో నరసింహన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఏర్పాటు చేయబోతున్న ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాల గురించి గవర్నర్ తో సీఎం కేసీఆర్ చర్చించడం విశేషం! గవర్నర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకున్నారు. రైతు బంధు పథకం చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానించేందుకు కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా ఫెడరల్ ఫ్రెంట్ అంశం చర్చకు వచ్చింది.
కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబోతున్న ఫ్రెంట్ కల సాకారమౌతుందని గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ అన్నారు. ఈ దిశగా ఇంతవరకూ తాను చేసి ప్రయత్నాన్ని ఆయనకి కేసీఆర్ వివరించారు. మమతా బెనర్జీ, స్టాలిన్, హేమంత్ సోరెన్, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్ లతో జరిపిన చర్చల గురించి కూడా కేసీఆర్ ఆయనకి చెప్పారు. కాంగ్రెస్, భాజపాలకి నిర్దిష్టమైన లక్ష్యాలు లేకుండా పోవడం వల్లనే దేశానికి ఒక దశాదిశా లేకుండాపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫ్రెంట్ ఏర్పాటు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయబోతున్నట్టు వివరించారట!
నిజానికి, గవర్నర్ కు ఇవన్నీ వివరించాల్సిన అవసరం కేసీఆర్ కి ఏముంటుంది..? ఇప్పటికే తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై నివేదికల మీద నివేదికల్ని తయారు చేసి కేంద్రానికి గవర్నర్ ఇస్తుంటారనే అభిప్రాయముంది. తనకు అవసరం లేని, తన పరిధిలో లేని రాజకీయాంశాలపై కూడా గవర్నర్ స్పందిస్తూ ఉండటం ఎప్పటికప్పుడు చర్చనీయం అవుతూనే ఉంది. ఇలాంటి సందర్భంలో జరిగిన భేటీలో ఫ్రెంట్ అంశం ప్రస్థావనకు రావడం విశేషం. ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు పూర్తిగా తెరాసకు సంబంధించిన ఒక రాజకీయ వ్యవహారం. దీన్ని పూసగుచ్చినట్టు గవర్నర్ కు వివరించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. మరి, నరసింహన్ కు ఎందుకు చెప్పినట్టు..? కేసీఆర్ చేసే పనుల్లో ఏదో ఒక అంతరార్థం ఉంటుంది కదా! తాను చేస్తున్న ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు ప్రయత్నానికి అనూహ్య స్పందన వస్తోందన్న అంశాన్ని గవర్నర్ కు అర్థమయ్యేలా చేయాలన్నది కూడా కేసీఆర్ వ్యూహం కావొచ్చు!