కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి తెలుగువారి పాత్ర ఎంత కీలకంగా మారిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో భాజపాకి వ్యతిరేకంగా ఓటెయ్యాలంటూ ఇప్పటికే టీడీపీ పిలుపునిచ్చింది. అయితే, ఇదే సందర్భంలో ఏపీ ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు బెంగళూరు వెళ్లడంపై భాజపా వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగికి కర్ణాటక ఎన్నికలతో సంబంధం ఏముందనీ, భాజపాకి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ మండిపడుతున్నారు. ఆయన బెంగళూరుకు వెళ్లి, అక్కడి తెలుగువారితో ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే.
తాను ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారానికి రాలేదని అశోక్ బాబు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం అత్యంత కీలకమైందనీ, దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. పొరపాటు చేస్తే ఏం జరుగుతుందనేది ఏపీలో చూస్తున్నామన్నారు. ఏపీ ఒక్కటే కాదనీ, దేశవ్యాప్తంగా భాజపా విధానాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయన్నారు. ఈ నష్టాలను తెలుగువారికి వివరించి, ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చామని ఆయన చెప్పారు.
అయితే, ఏపీ భాజపా నేతల ఆగ్రహం మరోలా ఉంది! ఆయన ఉద్యోగాల సంఘాల నాయకుడా, లేదా రాజకీయ సంఘాల నాయకుడిగా వచ్చారా అంటూ ప్రశ్నిస్తున్నారు. విభజన సమయంలో కూడా ఆయన ఇలానే దళారీగా వ్యవహరించారని ఆరోపించారు. తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులను వాడుకుంటున్నారని అంటున్నారు. త్వరలో రిటైర్ కాబోతున్నారనీ, కాబట్టి ఇప్పట్నుంచీ తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు. ఆయన తీరుపై ఎన్నికల సంఘానికి త్వరలోనే ఫిర్యాదు చేయబోతున్నామని ఏపీ భాజపా నేతలు అంటున్నారు. అశోక్ బాబుతో సహా కొంతమంది బృందం కర్ణాటక వెళ్లేందుకు విమాన టిక్కెట్లు ఎవరిచ్చారనే వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగాల సంఘాల తరఫున ఉద్యమించడం అర్థవంతంగా అనిపించింది. ఆ సమయంలో ఉద్యోగుల ప్రయోజనాలూ సంకట స్థితిలో ఉన్నాయి కాబట్టి. కానీ, ఇప్పుడు కర్ణాటకకు ఆయన వెళ్లడం.. అదీ ఉద్యోగ సంఘాల తరఫున ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనేది అభ్యంతరకమైన అంశమే. వాస్తవానికి ఏపీ ఉద్యోగ సంఘాలకు కర్ణాటకలో పనేముంది..? అక్కడి తెలుగువారిని చైతన్య పరచాల్సిన బాధ్యత వీరికేముంది..? ఆ పని ఎలాగూ ఏపీ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో అశోక్ బాబు తీవ్ర విమర్శలు ఎదుర్కొనక తప్పేట్టు లేదు.